Shahzadi Khan: యూపీ మహిళకు యూఏఈలో ఉరి
ABN , Publish Date - Mar 04 , 2025 | 05:57 AM
గత నెల 15న ఆమెను ఉరితీశారని, ఈ నెల 5న ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ న్యాయస్థానానికి తెలిపారు.
గత నెల 15న శిక్ష అమలు.. రేపు అంత్యక్రియలు
న్యూఢిల్లీ, మార్చి 3: ఉత్తరప్రదేశ్‌కు చెందిన షహజాదీ ఖాన్ అనే 33ఏళ్ల మహిళను 4 నెలల చిన్నారి మృతి కేసులో హత్య అభియోగాలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఉరితీసిందని భారత విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. గత నెల 15న ఆమెను ఉరితీశారని, ఈ నెల 5న ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ న్యాయస్థానానికి తెలిపారు. షహజాదీ ఖాన్ తండ్రి షబ్బీర్ ఖాన్ తన కుమార్తె విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో భారత విదేశాంగ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. యూపీ బాందా జిల్లాకు చెందిన షహజాదీ ఖాన్‌ను ఉజైర్ అనే వ్యక్తి అబుధాబీ వెళ్తే జీవితం బాగుంటుందని మాయమాటలు చెప్పి తన బంధువులైన ఫైజ్-నాడియా దంపతులకు విక్రయించాడు.
ఈ క్రమంలో ఆమె 2021 డిసెంబరులో అబుధాబీ చేరుకుంది. ఆమెను అబుధాబీకి తీసుకెళ్లిన ఫైజ్-నాడియా దంపతుల 4 నెలల చిన్నారికి సంరక్షురాలిగా వ్యవహరించేది. 2022 డిసెంబరు 7న వ్యాక్సినేషన్లుఇవ్వగా చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దంపతులు ఆమెపై హత్య ఆరోపణలు మోపారు. అయితే ఔషధాల విషయంలో దంపతుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని షహజాదీ ఆరోపించారు. చివరకు యూఏఈ న్యాయస్థానం ఆమెకు మరణ శిక్షను విధించింది. చివరి కోరిక ఏంటని అడగ్గా తన కుటుంబసభ్యులతో మాట్లాడతానని ఆమె కోరడంతో కోర్టు అనుమతించింది. గత నెలలో తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తాను నిర్దోషినని షహజాదీ ఖాన్ కన్నీటి పర్యంతమైంది. మరోవైపు ఫైజ్-నాడియా దంపతులపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది.