Indian Sikh Woman: సిక్కు మహిళ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. పాకిస్థాన్ వ్యక్తితో పెళ్లి..
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:47 PM
సిక్కు ఆలయాల సందర్శన కోసం ఇండియా నుంచి పాకిస్థాన్ వెళ్లిన ఓ మహిళ కుటుంబానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ‘నిఖానమా’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సిక్కు మహిళ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. తీర్థయాత్రల కోసం పాకిస్థాన్ వెళ్లిన ఆ మహిళ మతం మారి అక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ‘నిఖానమా’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన ‘ది శిరోమణి గురుద్వారా పర్భందక్ కమిటీ’ ప్రతీ ఏటా కొంతమందిని ఎంపిక చేస్తుంది. గురు నానక్ దేవ్ ప్రకాశ్ పర్వ్‌ను పురస్కరించుకుని వారిని పాకిస్థాన్‌లో ఉన్న పవిత్ర సిక్కు ఆలయాల సందర్శనకు పంపుతుంది.
పది రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. ఈ ఏడాది 1992 మంది ఎంపికయ్యారు. వీరిలో కపుర్తలాకు చెందిన 52 ఏళ్ల శరబ్‌జిత్ కౌర్ కూడా ఉంది. నవంబర్ 4వ తేదీన భక్తులందరూ పాకిస్థాన్‌లోకి వెళ్లారు. పది రోజుల యాత్ర ముగిసిన తర్వాత నవంబర్ 13వ తేదీన వారంతా తిరిగి వచ్చారు. అయితే, వారిలో కౌర్ మాత్రం లేదు. దీంతో అధికారులు ఆమె గురించి వెతకటం మొదలెట్టారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టులో ‘నిఖానమా’ ఫొటో ఉంది.
ఆ నిఖనమాలో.. పాకిస్తాన్, షేక్‌పురకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని కౌర్ పెళ్లి చేసుందని రాసి ఉంది. కౌర్ గతంలో కర్నైన్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. కౌర్ గత కొన్నేళ్ల నుంచి ఒంటరిగా ఉంటోంది. కౌర్‌కు నాసిర్‌తో ఎలా పరిచయం అయిందన్నది తెలియరాలేదు. భారత అధికారులు పాకిస్థాన్ అధికారులతో టచ్‌లో ఉన్నారు. కౌర్ గురించి ఎప్పటి కప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కౌర్ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఈ అద్భుతమైన పురాతనమైన భవనాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి..
ఫేక్ ఫేస్‌బుక్ ఐడీతో మోసం.. స్పందించిన సజ్జనార్..