Share News

Nuclear Scientist: ‘అణు’ శక్తిమంతుడు ఇక లేరు!

ABN , Publish Date - Jan 05 , 2025 | 03:19 AM

భారత అణు కార్యక్రమ రూపశిల్పి రాజగోపాల చిదంబరం (88) మరణించారు. ముంబైలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో అ నారోగ్యంతో ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయ న మృతిని భారత్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ (బీఏఈ) సంస్థ ధ్రువీకరించింది.

Nuclear Scientist: ‘అణు’ శక్తిమంతుడు ఇక లేరు!

ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత

అనారోగ్యంతో ముంబైలో తుదిశ్వాస

రెండు పోఖ్రాన్‌ అణు పరీక్షల్లోనూ కీలకం

సూపర్‌ కంప్యూటర్లు, నేషనల్‌ నాలెడ్జీ నెట్‌వర్క్‌కు సైద్ధాంతిక తోడ్పాటు

మోదీ, చంద్రబాబు, ఖర్గే నివాళులు

న్యూఢిల్లీ, జనవరి 4 : భారత అణు కార్యక్రమ రూపశిల్పి రాజగోపాల చిదంబరం (88) మరణించారు. ముంబైలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో అ నారోగ్యంతో ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయ న మృతిని భారత్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ (బీఏఈ) సంస్థ ధ్రువీకరించింది. భారత్‌ జరిపిన రెండు అణు పరీక్షల్లోనూ అణుశాస్త్రవేత ్తగా ఆయన పాలుపంచుకోవడం విశేషం. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో 1974లో ఒకటి, మరో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయీ సారథ్యంలో 1998లో మరొకటి జరపడం అప్పట్లో సంచలనం రేపింది. దేశంలో అణ్వాయుధ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలోనూ చిదంబరం పాత్ర ఉంది. కేంద్ర ప్రభుత్వానికి శాస్త్రీయ ముఖ్య సలహాదారుగాను, పలు సంస్థలకు సారథిగాను 17 ఏళ్లు చిదంబరం సేవలు అందించారు.

వైజ్ఞానిక శిఖరం..

తమిళనాడులో 1936లో రాజగోపాల చిదంబరం జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మీరట్‌లోని సనాతన ధర్మ హైస్కూలులో పూర్తిచేశారు. చెన్నైలోని మైలాపూర్‌లోని పీఎస్‌ విద్యాలయంలో ఎనిమిది నుంచి ఇంటరు వరకు చదివారు. అనంతరం ప్రెసిడెన్సీ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేశారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో చేరి పీహెచ్‌డీ చేశారు. బాబా ఆటమిక్‌ రిసెర్చ్‌ సెంటరులో (బార్క్‌) 1963లో చేరి.. 1990 నాటికి ఆ సంస్థ డైరెక్టరుగా ఎదిగారు. అతిభార లోహాల భౌతికశాస్త్రం (హై ప్రెజర్‌ ఫిజిక్స్‌), పరమాణు, స్ఫటికాకార శాస్త్రం (క్రిస్టలోగ్రఫీ), మెటీరియల్‌ సైన్స్‌లో కొత్త కోణాలు ఆయన ఆవిష్కరించారు. వైజ్ఞానిక సముదాయానికి చెందినవారి అవగాహనను ఆయన పరిశోధనలు విస్తృతం చేశారు. భారత్‌లో మోడ్రన్‌ మెటీరియల్‌ సైన్స్‌కు ఆయన ఆద్యుడు. ఇంధనాలు, ఆరోగ్య సంరక్షణ; వ్యూహాత్మక రంగంలో స్వీయసమృద్ధి వంటి అంశాల్లో తిరుగులేని ఆవిష్కరణలు ఆయన అందించారు. ఆయనను ప్రపంచ స్థాయి భౌతిక శాస్త్రవేత్తగా పరిగణించేవారు. దేశీయ పద్ధతుల్లో సూపర్‌ కంప్యూటర్లను అభివృద్ధి చేయడంలోనూ, నేషనల్‌ నాలెడ్జీ నెట్‌వర్క్‌ ఏర్పాటులోను సైద్ధాంతిక సహకారం అందించారు. జాతీయాభివృద్ధికి వైజ్ఞానిక, సాంకేతిక జ్ఞానాన్ని జోడించాలని గట్టిగా కోరుకున్నవారిలో ఆయన ముఖ్యుడు. ఆయనను 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు వరించాయి. పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను సత్కరించాయి.


ప్రముఖుల నివాళులు

భారత అణు కార్యక్రమ నిర్మాణంలో ప్రధాన భూమిక చిదంబరం పోషించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ వైజ్ఞానిక, వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఆయన అత్యుత్తమ భాగస్వామ్యం అందించారని కొనియాడారు. దేశం నిర్వహించిన రెండు అణు పరీక్షల్లో ఆయన పాత్ర చిరస్మరణీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అలాంటి శాస్త్రవేత్తను కోల్పోవడం విచారకరమని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. అణుశక్తి కమిషన్‌ సారథిగా పలు వ్యూహాత్మక అస్త్రాలను మనకు ఆయన అందించారని కేంద్రం వైజ్ఞానిక, సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. అద్భుతమైన వైజ్ఞానిక మేధస్సును దేశం కోల్పోయిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అన్నారు. వైజ్ఞానిక, సాంకేతిక క్షేత్రాల్లో చిదంబరం విశిష్ఠ వ్యక్తి అని, ఆయన చొరవతోనే వ్యూహాత్మక రంగంలో భారత్‌ స్వయంశక్తిని సంతరించుకున్నదని అణుశక్తి విభాగం కార్యదర్శి అజిత్‌కుమార్‌ మొహంతీ కొనియాడారు. అసంఖ్యాక శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను నడిపించిన నిబద్ధ మార్గదర్శి, స్ఫూర్తిదాయక నాయకుడు, వైతాళికుడి రూపంలో చిదంబరం సదా గుర్తుండిపోతారని అణుశక్తి కమిషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Jan 05 , 2025 | 03:19 AM