Siraj Ansari Disappearance: ఇరాన్‌లో బిహార్ ఇంజనీర్ అదృశ్యం
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:48 AM
గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్‌లో ఉంటున్న బిహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన యువ ఇంజనీర్ సిరాజ్ అలీ అన్సారీ (25) అదృశ్యం కావడం పట్ల...
న్యూఢిల్లీ, జూన్ 23: గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్‌లో ఉంటున్న బిహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన యువ ఇంజనీర్ సిరాజ్ అలీ అన్సారీ (25) అదృశ్యం కావడం పట్ల ఆయన కుటుంబం ఆందోళన చెందుతోంది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామపలి గ్రామ నివాసి అయిన అన్సారీ ఓ పెట్రోలియం కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్. సిరాజ్ సౌదీకి వెళ్లి అక్కడి నుంచి ఈ నెల 9న ఇరాన్‌కు చేరాడని ఆయన తండ్రి హజ్రత్ అలీ తెలిపారు. ఈ నెల 17న చివరిసారిగా అతను మాట్లాడాడని, అప్పటి నుంచి అతని ఫోన్ స్విచ్ఛా్‌పలో ఉండటం తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తన కుమారుడు చివరిసారి మాట్లాడినప్పుడు తాను సురక్షితమైన ప్రదేశంలోనే ఉన్నానని, అయితే తాను ఉంటున్న ప్రదేశానికి కిలో మీటర్ దూరంలో బాంబులు పడుతున్నట్టు చెప్పాడన్నారు. సిరాజ్ సురక్షితంగా తిరిగివచ్చేలా కృషి చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రభుత్వాన్ని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు వారు సివాన్ జిల్లా మెజిస్ర్టేట్‌ను లిఖితపూర్వకంగా అభ్యర్థించారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో ఉంటున్న భారతీయ కుటుంబాల భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆపరేషన్ సింధులో భాగంగా ఆదివారం సాయంత్రం మరో 285 మంది భారతీయులను ఢిల్లీకి తీసుకువచ్చారు. దీంతో ఇరాన్ నుంచి తరలించిన భారతీయుల సంఖ్య 1,713కు చేరుకుంది.