Shubhanshu Shukla: రోదసిలో రైతుగా శుక్లా
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:33 AM
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎ్‌స)లో ఉన్న భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా రైతుగా మారారు. మెంతి, పెసర విత్తనాలను మొలకెత్తించే ప్రయోగాల్లో భాగస్వామి అయ్యారు.
ఐఎస్ఎస్‌లో మెంతి, పెసర విత్తనాలపై ప్రయోగం
న్యూఢిల్లీ, జూలై 9: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎ్‌స)లో ఉన్న భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా రైతుగా మారారు. మెంతి, పెసర విత్తనాలను మొలకెత్తించే ప్రయోగాల్లో భాగస్వామి అయ్యారు. ఆ విత్తనాలను ప్రత్యేకమైన గాజు పాత్రలో పెట్టి, వాటి ఫొటోలు తీశారు. తర్వాత ఆ పాత్రలను ఐఎ్‌సఎ్‌సలో ఉన్న స్టోరేజీ ఫ్రీజర్‌లో భద్రపరిచారు. అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తడంపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావం, ప్రాథమిక స్థాయిలో వాటి ఎదుగుదల ఎలా ఉంటుందనే దానిని పరిశీలించడానికి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు.. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, ధార్వాడ్‌కు చెందిన రవికుమార్ హోసమణి, ఐఐటీ ధార్వాడ్‌కు చెందిన సుధీర్ సిద్ధపురెడ్డి నేతృత్వంలో శుక్లా చేపట్టారు. భూమికి వచ్చాక ఆ విత్తనాల్లో వచ్చిన జన్యుపరమైన మార్పులను పరిశీలిస్తారని యాగ్జియం స్పేస్ ఓ ప్రకటనలో తెలిపింది.
మరో ప్రయోగంలో ఆయన సూక్ష్మ ఆల్గేలు అంతరిక్షంలో ఆహారం తయారు చేసుకోవడం, ఆక్సిజన్, జీవ ఇంధనాల ఉత్పత్తి సామర్థ్యంపై అధ్యయనం చేశారు. కాగా, శుక్లాతో పాటు ఐఎ్‌సఎ్‌సకు వెళ్లిన వ్యోమగాములు గురువారం తర్వాత ఎప్పుడైనా భూమికి తిరిగివచ్చే అవకాశం ఉంది. అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో వాతావరణ పరిస్థితిని బట్టి యాగ్జియం-4 మిషన్ అన్‌డాకింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ మిషన్‌లో భాగంగా 14 రోజులు వారు అంతరిక్షంలో ఉండే అవకాశం ఉండగా.. బుధవారంతో 12 రోజులు పూర్తయ్యాయి.