Air Force : వాయుసేనలో ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:50 AM
భారత వాయుసేన సామర్థ్యం పెంపునకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకోక తప్పదని ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయపడింది.

ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ, మార్చి 4: భారత వాయుసేన సామర్థ్యం పెంపునకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకోక తప్పదని ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయపడింది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యల్లో భాగంగా ప్రైవేటు సంస్థల సహకారం తీసుకొని లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సి ఉందని తెలిపింది. సకాలంలో యుద్ధ విమానాలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నట్టు సాక్షాత్తూ వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్ బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో కమిటీ చేసిన ఈ సూచనకు ప్రాధాన్యం ఏర్పడింది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ ఆఽధ్వర్యంలోని సాధికారిక కమిటీ సోమవారం రక్షణ మంత్రికి అందజేసిన నివేదికలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రస్తావించింది. యుద్ధ విమానాలు, ఆయుధాలు, మౌలిక వసతులు, స్థానికంగా ఉత్పత్తి తదితర అంశాల్లో ఉన్న లోటుపాట్లను అధ్యయనం చేసి, వాటిని అధిగమించడానికి సిఫార్సులు చేసింది. వాయుసేనకు 42 ఫైటర్ స్క్వాడ్రన్స్ మంజూరు కాగా, ప్రస్తుతం 30 మాత్రమే ఉన్నాయి. ఏటా 40 యుద్ధ విమానాలు సరఫరా కావాల్సి ఉండగా సకాలంలో అందడం లేదు. తేలికపాటి యుద్ధ విమానాలు (ఎల్‌సీఏ ఎంకే-1ఏ తరహావి) సరఫరా చేయడంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సామర్థ్యంపై వాయుసేన అధిపతి అనుమానాలు వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే యుద్ధ విమానాల తయారీ, ఇతర అంశాల్లో ప్రైవేటు భాగస్వామ్యం తీసుకోవాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది.