అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం?
ABN , Publish Date - May 29 , 2025 | 05:30 AM
భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరనుందా? వచ్చే నెలలోనే ఇరుదేశాలూ ఈ మేరకు ఒప్పందం చేసుకోనున్నాయా? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి.
వాషింగ్టన్‌లో చర్చలు జరిపిన కేంద్ర మంత్రి గోయెల్, వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్
జూన్‌లో భారత్‌కు అమెరికా అధికారులు
న్యూఢిల్లీ, మే 28: భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరనుందా? వచ్చే నెలలోనే ఇరుదేశాలూ ఈ మేరకు ఒప్పందం చేసుకోనున్నాయా? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, మధ్యంతర వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపాయి. జూన్‌లో అమెరికా అధికారుల బృందం భారత పర్యటనకు రానున్నట్లు సమాచారం. కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యే క కార్యదర్శి, చర్చలకు ప్రధాన మధ్యవర్తిగా ఉన్న రాజేశ్ అగర్వాల్ గత వారమే నాలుగు రోజుల అమెరికా పర్యటన ముగించుకొన్న సంగతి తెలిసిందే. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ఆయన వాషింగ్టన్‌లో అమెరికా అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం.
గత వారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కూడా అమెరికా ప ర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య మంత్రి హొవార్డ్ లుత్నిక్‌తో రెండుసార్లు భేటీ అయ్యారు. ఒప్పందంపై చర్చలు జరిపారు. భారత్‌పై 26ు ప్రతీకార సుంకం విధిస్తామన్న నిర్ణయాన్ని అమెరికా జూలై 9 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కంటే ముందుగా జూన్‌లోనే మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నాయి. మరోవైపు మధ్యంతర వాణిజ్యం ఒప్పందంలో భాగంగా తమ వస్తువులపై 26ు ప్రతీకార సుంకాలను పూర్తిగా మినహాయించాలని అమెరికాను భారత్ కోరనున్నట్లు సమాచారం.