Global Air Force Rankings: వైమానిక దళ ర్యాంకుల్లో భారత్ సత్తా
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:03 AM
వైమానిక దళం ర్యాంకుల్లో చైనాను భారత్ అధిగమించింది. ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతమైన దేశంగా అవతరించింది.
చైనాను అధిగమించి మూడో స్థానంలోకి
నాలుగో స్థానానికి పరిమితమైన డ్రాగన్ దేశం
న్యూఢిల్లీ, అక్టోబరు 16: వైమానిక దళం ర్యాంకుల్లో చైనాను భారత్ అధిగమించింది. ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతమైన దేశంగా అవతరించింది. సుదీర్ఘ కాలం నుంచి ఆసియాలో ప్రధాన వైమానిక శక్తిగా పేరొందిన చైనా ఇప్పుడు నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ జాబితాలో అమెరికా టాప్‌లో ఉండగా రెండో స్థానంలో రష్యా నిలిచింది. 103 దేశాలకు చెందిన 120 రకాల వైమానిక సేవలకు సంబంధించిన ర్యాంకులను వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (డబ్ల్యూడీఎంఎంఏ) తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 242.9 ట్రూ వాల్ రేటింగ్ (టీవీఆర్)తో అమెరికా వాయుసేన మొదటి స్థానంలో ఉంది. రష్యా (114.24) రెండో స్థానంలో నిలవగా భారత్ (69.4), చైనా (63.8), జపాన్ (58.1), ఇజ్రాయెల్ (56.3), ఫ్రాన్స్ (55.3) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 46.3 రేటింగ్‌తో పాకిస్థాన్ 18వ స్థానానికి పరిమితమైంది.