Share News

PM Modi: నవ భారతంలో అవకాశాలకు హద్దే లేదు

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:01 AM

భారత్‌లో అవకాశాలకు హద్దే లేదని, త్వరలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

PM Modi: నవ భారతంలో అవకాశాలకు హద్దే లేదు

  • త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది

  • ఏఐ, సెమీకండక్టర్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లతో ముందంజ

  • బిహార్‌ వారసత్వం ఘనమైనది

  • ట్రినిడాడ్‌-టొబాగోలో మోదీ

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, జూలై 4 : భారత్‌లో అవకాశాలకు హద్దే లేదని, త్వరలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏఐ, సెమీకండక్టర్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చేపడుతోన్న పరిశోధనలు భారత్‌ అభివృద్ధికి నూతన చోదకాలుగా ఉన్నాయని చెప్పారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆయన గురువారం ట్రినిడాడ్‌-టొబాగో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్‌, కేబినెట్‌ మంత్రులు, శాసనసభ్యులు తదితరులు 4000 మందికిపైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. భారత్‌ నేడు అవకాశాల గని అని, అభివృద్ధి ఫలాలు అర్హులకు అందుతున్నాయని వారికి వివరించారు. ప్రధాని తన ప్రసంగంలో అక్కడ స్థిర పడిన భారత సంతతి ప్రజలను ప్రశంసలతో ముంచెత్తారు. అయోధ్య ఆలయ నమూనాను, సరయు నది జలాలను, కుంభమేళా సందర్భంగా సేకరించిన గంగా జలాలను వారి కోసం తీసుకువచ్చినట్లు చెప్పారు. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులను యూపీఐ విప్లవాత్మకం చేసిందన్నారు.


ప్రస్తుతం ప్రపంచంలో జరిగే డిజిటల్‌ లావాదేవీల్లో సగం భారత్‌లోనే జరుగుతున్నాయన్నారు. ట్రినిడాడ్‌, టుబాగోలో తొలిసారిగా ఈ వ్యవస్థను ప్రవేశ పెడుతున్నందుకు అభినందనలు తెలిపారు. కాగా ట్రినిడాడ్‌ టుబాగోలోని కూవాలో మాట్లాడుతూ.. బిహార్‌ రాష్ట్రంతో అక్కడి వారికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక్కడున్న పలువురి పూర్వీకులు బిహార్‌ వారే అన్నారు. ఆ ద్వీప దేశ ప్రధాని పూర్వీకులు కూడా బిహార్‌ వారేనని, భారత ప్రజలు ఆమెను బిహార్‌ పుత్రికగా భావిస్తారని పేర్కొన్నారు. బిహార్‌లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఆ రాష్ట్ర వివరాలను ప్రధానంగా ప్రస్తావించారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ప్రధాని మోదీని ట్రినిడాడ్‌, టుబాగో అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద రిపబ్లిక్‌ ఆఫ్‌ ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో’తో శుక్రవారం సత్కరించారు. మరోవైపు ఆ దేశ ప్రధాని ఇచ్చిన విందులో ఆయనకు సోహరీ ఆకుపై భోజనం వడ్డించడం విశేషం.


వెస్ట్‌ ఇండీస్‌ జట్టు అంటే అభిమానం!

ట్రినిడాడ్‌ టుబాగో పర్యటనలో భాగంగా మోదీ ఆ దేశ పార్లమెంటులో శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా క్రికెట్‌ గురించి ప్రస్తావించి పార్లమెంటు సభ్యులను ఆకట్టుకున్నారు. వెస్ట్‌ ఇండీస్‌ క్రికెట్‌ జట్టుకు భారతీయులు గట్టి అభిమానులు అని... వారు భారత్‌తో ఆడినప్పుడు తప్ప మిగిలిన అన్ని పోటీల్లో వారి విజయాన్ని కాంక్షిస్తారని జోక్‌ చేశారు. 180 ఏళ్ల క్రితం భారతీయులు వలస రావడంతో మొదలైన రెండు దేశాల మధ్య అనుబంధాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు. రాజకీయాల నుంచి కవితల వరకు, క్రికెట్‌ నుంచి వాణిజ్యం వరకు భారత్‌ నుంచి వలస వచ్చిన వారు ట్రినిడాడ్‌, టుబాగోలో అన్ని రంగాల్లో తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.

Updated Date - Jul 05 , 2025 | 05:01 AM