Share News

Nuclear War: కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం అక్కర్లేదు

ABN , Publish Date - May 14 , 2025 | 06:12 AM

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అణు యుద్ధాన్ని నివారించానని ట్రంప్‌ పేర్కొన్న వాదనను భారత్‌ ఖండించింది. కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం చేసేందుకు ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను కూడా భారత ప్రభుత్వం తోసిపుచ్చింది.

Nuclear War: కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం అక్కర్లేదు

ట్రంప్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ

తన వైఖరి స్పష్టం చేసిన భారత్‌

న్యూఢిల్లీ, మే 13: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అణు యుద్ధాన్ని తానే నివారించానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాదనను భారత్‌ ఖండించింది. అంతేకాదు, కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తామన్న ట్రంప్‌ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ట్రంప్‌ వ్యాఖ్యలపై మంగళవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ బదులిస్తూ భారత్‌ వైఖరిని స్పష్టం చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్‌ అంగీకరించదని తేల్చి చెబుతూ ట్రంప్‌ త్రిపాదనను పరోక్షంగా తోసిపుచ్చారు. పాకిస్థాన్‌ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందేనని, ఈ డిమాండ్‌లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. కాల్పుల విరమణ, ద్వైపాక్షిక చర్చల కోసం పాకిస్థాన్‌ నుంచే భారత విదేశాంగ శాఖకు విజ్ఞప్తి వచ్చిందని తెలిపారు. కాల్పుల విరమణపై ఇరు దేశాల మధ్య డీజీఎంవోల స్థాయిలోనే చర్చలు జరిగాయని జైశ్వాల్‌ పేర్కొంటూ తన చొరవతోనే భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం ఆగిందన్న ట్రంప్‌ ప్రకటనను కూడా పరోక్షంగా ఖండించారు. పాకిస్థాన్‌ దాడి చేస్తే.. భారత్‌ బదులిస్తుందని, పాకిస్థాన్‌ చేయకపోతే భారత్‌ కూడా చేయదని తెలిపారు. ఇదే విషయాన్ని పాక్‌ డీజీఎంవోకు తెలియజేశామని చెప్పారు.


‘ఆపరేషన్‌ సిందూర్‌ మొదలైనప్పటి నుంచి ఈ నెల 10 వరకు జరిగిన సైనిక చర్యలపై భారత్‌-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. యుద్ధ వాతావరణంలోనే చర్చలు జరిగాయి తప్ప వాణిజ్య అంశాలు ప్రస్తావనకు రాలేద’ని తెలిపారు. పాక్‌లోని కిరానా అణు స్థావరాన్ని భారత్‌ క్షిపణులు తాకడంతో నష్టం జరిగిందన్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జైశ్వాల్‌ స్పందిస్తూ.. దీనిపై పాకిస్థానే బదులివ్వాలన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందన్నారు. కాగా, అపరేషన్‌ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించి తీరుపై 70 దేశాల రక్షణ శాఖ ప్రతినిధులకు రక్షణ శాఖ నిఘా విభాగం డీజీ డీఎస్‌ రాణా వివరించారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని మాణిక్‌షా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి 7పెద్ద దేశాలతో పాటు ఇస్లామిక్‌ దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 06:12 AM