Share News

Bharat Taxi: ఉబర్‌ ఓలాకు పోటీగా భారత్‌ ట్యాక్సీ

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:48 AM

క్యాబ్‌ సర్వీసులు అందించే ఓలా, ఉబర్‌లకు పోటీగా భారత్‌ ట్యాక్సీ వస్తోంది.

Bharat Taxi: ఉబర్‌ ఓలాకు పోటీగా భారత్‌ ట్యాక్సీ

  • సహకార విధానంలో తెస్తున్న కేంద్రం

  • వచ్చే నెల నుంచి ఢిల్లీలో పైలట్‌ ప్రాజెక్టు

  • డిసెంబరు నుంచి దేశవ్యాప్తంగా విస్తరణ

న్యూఢిల్లీ, అక్టోబరు 24: క్యాబ్‌ సర్వీసులు అందించే ఓలా, ఉబర్‌లకు పోటీగా ‘భారత్‌ ట్యాక్సీ’ వస్తోంది. క్యాబ్‌ నిర్వాహకుల నుంచి ఎలాంటి కమీషన్లు వసూలు చేయకుండా, సహకార పద్ధతిలో నిర్వహించే ఈ సర్వీసుతో.. అటు క్యాబ్‌ నిర్వాహకులకు, ఇటు ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ఓలా, ఉబర్‌ సంస్థలు క్యాబ్‌ నిర్వాహకులు, డ్రైవర్ల నుంచి అడ్డగోలుగా 25ు వరకు కమీషన్లు వసూలు చేస్తున్నాయని.. ప్రయాణాల రద్దు, రద్దీ సమయాల పేరిట ప్రయాణికుల నుంచి అడ్డగోలు చార్జీలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రైవేటు క్యాబ్‌ సర్వీసులకు ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తేవడం.. క్యాబ్‌ నిర్వాహకులు, డ్రైవర్లకు ప్రయాణ చార్జీలు పూర్తిగా అందేలా చేయడం లక్ష్యంగా.. కేంద్ర సహకారశాఖ, జాతీయ ఈ-గవర్నెన్స్‌ విభాగం (ఎన్‌ఈజీడీ) ‘భారత్‌ ట్యాక్సీ’ని రూపొందించింది. రూ.300 కోట్ల మూలధనంతో ‘సహకార్‌ ట్యాక్సీ కో-ఆపరేటివ్‌ లిమిటెడ్‌’ సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులో క్యాబ్‌ నిర్వాహకుల నుంచి కేవలం రోజువారీ, నెలవారీ సభ్యత్వ రుసుమును మాత్రమే తీసుకుంటారు. నవంబర్‌ నుంచి ఢిల్లీలో పైలట్‌ ప్రాజెక్టుగా 650 క్యాబ్‌లతో ‘భారత్‌ ట్యాక్సీ’ని ప్రారంభించనున్నారు. డిసెంబర్‌లో ముంబై, పుణె, భోపాల్‌, లక్నో, జైపూర్‌ సహా 20 నగరాలకు, వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రధాన నగరాలన్నింటికీ భారత్‌ ట్యాక్సీని విస్తరిస్తారు. 2030 నాటికి లక్ష మంది క్యాబ్‌ డ్రైవర్లను భారత్‌ ట్యాక్సీకి అనుసంధానం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 04:48 AM