Share News

Bunker Buster Bomb: మనకూ బంకర్‌ బస్టర్‌ బాంబులు

ABN , Publish Date - Jul 01 , 2025 | 05:26 AM

ఇటీవల ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బంకర్‌ బస్టర్లు తీవ్ర నష్టం కలిగించాయి. దీంతో వాటి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా అమెరికా తరహాలో బంకర్‌ బస్టర్‌ బాంబుల తయారీపై దృష్టిపెట్టింది.

Bunker Buster Bomb: మనకూ బంకర్‌ బస్టర్‌ బాంబులు

  • అమెరికా తరహాలో అభివృద్ధిపై భారత్‌ దృష్టి

  • 7,500 కిలోల వార్‌హెడ్‌ మోసుకెళ్లేలా అగ్ని-5లో మార్పులు

న్యూఢిల్లీ, జూన్‌ 30: ఇటీవల ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బంకర్‌ బస్టర్లు తీవ్ర నష్టం కలిగించాయి. దీంతో వాటి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా అమెరికా తరహాలో బంకర్‌ బస్టర్‌ బాంబుల తయారీపై దృష్టిపెట్టింది. అయితే వీటిని యుద్ధ విమానాలపై నుంచి కాకుండా క్షిపణుల ద్వారా ప్రయోగించేందుకు వీలుగా అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిలో మార్పులు చేస్తున్నట్టు తెలిసింది. దీనికోసం ఇప్పటికే రంగంలోకి దిగిన డీఆర్‌డీవో భారీ బంకర్‌ బస్టర్‌ బాంబును మోసుకెళ్లేందుకు వీలుగా అగ్ని-5 మిస్సైల్‌లో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అగ్ని-5 క్షిపణి గరిష్ఠంగా 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వాయుధ ప్రయోగాల కోసం దీన్ని రూపొందించారు. అయితే ఈ అణు వార్‌హెడ్‌ స్థానంలో 7,500 కిలోల బరువుండే బంకర్‌ బస్టర్‌ బాంబులను మోసుకెళ్లగలిగేలా డీఆర్‌డీవో మార్పులు చేస్తోంది.


కాంక్రీటు గోడలతో శత్రు దుర్బేధ్యంగా నిర్మించిన భూగర్భ కేంద్రాల (బంకర్లు)ను సైతం ధ్వంసం చేసేలా దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో దీని పరిధిని కూడా 2,500 కిలోమీటర్లకు కుదించారు. అలాగే ఇది మోసుకెళ్లే బంకర్‌ బస్టర్‌ బాంబు 80 నుంచి 100 మీటర్లమేర భూగర్భంలోకి చొచ్చుకుపోగలదని భావిస్తున్నారు. అగ్ని-5తో పోలిస్తే కొత్త వేరియంట్‌లో 2,500 కిలోమీటర్ల పరిధి తగ్గినప్పటికీ.. విధ్వంసక సామర్థ్యం, కచ్చితత్వం భారత వ్యూహాత్మక ఆయుధాల్లో దీన్ని కీలక శక్తిగా మారుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్థాన్‌, చైనా వంటి దేశాలలోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు, భూగర్భ క్షిపణి, సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించడం కోసం గ్ని-5లో రెండు కొత్త రకాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిసింది. వీటిలో ఒకటి భూమిపై ఉన్న లక్ష్యాల కోసం రూపొందిస్తుండగా.. మరొకటి భూగర్భంలోని లక్ష్యాలను ఛేదించేదిగా ఉండనుంది.

Updated Date - Jul 01 , 2025 | 05:26 AM