Share News

India Census: జనగణనకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jun 17 , 2025 | 03:52 AM

దేశంలో జనాభా లెక్కింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 16వ జనగణను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు అందులో స్పష్టం చేసింది.

India Census: జనగణనకు నోటిఫికేషన్‌

  • విడుదల చేసిన కేంద్ర హోం శాఖ.. మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో

  • 2026 అక్టోబరు 1 నాటికి పూర్తి.. మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1కి

  • 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, 1.3 లక్షల మంది సిబ్బందితో నిర్వహణ

  • అంచనా వ్యయం రూ.13 వేల కోట్లు.. డేటా లీక్‌ కాకుండా గట్టి చర్యలు

  • నోటిఫికేషన్‌లో కుల గణన ప్రస్తావనే లేదు.. ఇది మోదీ యూటర్నా?: జైరాం

  • కులగణన కూడా ఇందులో భాగమే: కేంద్ర హోం శాఖ

న్యూఢిల్లీ, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): దేశంలో జనాభా లెక్కింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 16వ జనగణను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు అందులో స్పష్టం చేసింది. మొదటి దశ ‘హౌజ్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ (హెచ్‌ఎల్‌వో)’లో భాగంగా.. ప్రజల ఇంటి పరిస్థితులు, వారి ఆస్తులు, ఇళ్లల్లో ఉండే సౌకర్యాల వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియను 2026 ఏప్రిల్‌లోనే ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇక, రెండో దశ (పాపులేషన్‌ ఎన్యూమరేషన్‌)లో భాగంగా ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలను సేకరిస్తారు. మంచు ఎక్కువగా ఉండే జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2026 అక్టోబరు 1 నాటికి, దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణనను పూర్తిచేయనున్నట్టు కేంద్రం తన నోటిఫికేషన్‌లో వివరించింది. అలాగే.. ప్రజలు తమ వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో, యాప్‌లో స్వయంగా నమోదు చేసుకునే (సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌) వీలునూ కల్పిస్తున్నట్టు తెలిపింది. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, 1.3 లక్షల మంది సిబ్బందితో.. ట్యాబ్‌ల ద్వారా పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించే ఈ భారీ కార్యక్రమానికి రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. సమాచార సేకరణకు సంబంధించి ఈ ఏడాది అక్టోబరు నుంచే ఎన్యూమరేటర్లకు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించే సిబ్బందికి, సూపర్‌వైజర్లకు 45 వేల మందికి పైగా ఫీల్డ్‌ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. వారికి 1800 మంది మాస్టర్‌ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. వారికి శిక్షణ ఇవ్వడానికి జాతీయస్థాయిలో 100 మంది శిక్షకులు ఉంటారు. జనగణనలో భాగంగా ఎన్యూమరేటర్లు 30కి పైగా ప్రశ్నలు అడిగి పౌరుల నుంచి సమాధానం రాబడతారు.


వారు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు? ఇంట్లో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉందా? వాడే వాహనాలేంటి? తినే తిండి, నీటి వనరులేంటి? ఇంటి పెద్ద స్త్రీయా? పురుషుడా? తదితర వివరాలను ఈ గణనలో భాగంగా సేకరించనున్నారు. ప్రజల నుంచి సమాచారం సేకరించే సమయంలోగానీ, ప్రసార సమయంలోగానీ, భద్రపరిచాకగానీ.. ఎక్కడా లీక్‌ కాకుండా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

2020లో వాయిదా..

సాధారణంగా కేంద్రం పదేళ్లకొకసారి జనాభా లెక్కింపు కార్యక్రమాన్ని చేపడుతుంది. అలా స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటిదాకా ఏడుసార్లు జనగణన చేపట్టారు. చివరిసారిగా 2011లో.. జనాభాను లెక్కించారు. ఆ తర్వాత పదేళ్లకు.. అంటే 2021లో మళ్లీజనగణన చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో 2020లో అందుకు సంబంధించిన సన్నాహాలు చేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కొన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పనులు చేపట్టడానికి ప్రణాళికలు కూడా రూపొందించారు. కానీ.. కొవిడ్‌ కారణంగా జనగణన కార్యక్రమం వాయిదా పడింది. కాగా.. 2021 జనాభా లెక్కల ఆధారంగా.. జాతీయ జనాభా పట్టికను (ఎన్‌పీఆర్‌) సైతం నవీకరించాలని 2020లో నిర్ణయించిన సర్కారు.. తాజా నోటిఫికేషన్‌లో దాని గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక.. జనగణనలో భాగంగానే కులగణన కూడా చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రివర్గం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా.. జనాభా లెక్కల సన్నాహాలపై ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన సమావేశం జరిగింది. అందులో కేంద్ర హోం కార్యదర్శి, రిజిస్ట్రార్‌ జనరల్‌, భారత్‌ జనాభా లెక్కల కమిషన్‌ (ఆర్జీ, సీసీఐ), ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీ దరిమిలా సోమవారం కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.


ఇది మరో యూ టర్నా?

జనగణనకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఎక్కడా కుల గణన ప్రస్తావనే లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రస్తావన లేకపోవడమంటే.. మోదీ ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకోవడమేనని ఎక్స్‌ వేదికగా ఆయన ఆరోపించారు. కుల గణన చేయాలన్న కాంగ్రెస్‌ నాయకులను మోదీ అర్బన్‌ నక్సల్స్‌గా అభివర్ణించారని.. పార్లమెంటులో, సుప్రీంకోర్టులో కుల గణనను తిరస్కరించారని గుర్తు చేశారు. వాటన్నింటి నేపథ్యంలో ఇది మరో యూ టర్న్‌ అవుతుందా? లేక వివరాలు తర్వాత ప్రకటిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. జనభా లెక్కింపు కేవలం కుల గణనే కాకుండా కులాల వారీగా సామాజిక, ఆర్థిక, రాజకీయలతో కూడిన వివరణాత్మ సమాచారంతో ఉండాలని, తెలంగాణ నమూనాను అనుసరించాలని సూచించారు. కేవలం కులాల వివరాలు సేకరించడంతో సరిపెట్టకుండా.. తెలంగాణ తరహాలో కులాలవారీగా సామాజిక, ఆర్థిక వివరాలు కూడా సేకరించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. కాగా.. జైరామ్‌ రమేశ్‌ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. కులగణన కూడా జనగణనలో భాగంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 30న, జూన్‌ 4న, జూన్‌ 15న వెల్లడించినట్టు గుర్తుచేశారు.

Updated Date - Jun 17 , 2025 | 03:53 AM