150 Years Of Vande Mataram: జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు.. రేపటినుంచే ఉత్సవాలు..
ABN , Publish Date - Nov 06 , 2025 | 08:51 PM
భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలమది. జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందేమాతరం.. మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది.
జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనుంది. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయి. 2025 నవంబర్ 7వ తేదీన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
150 ఏళ్ల మహోన్నత చరిత్ర..
బంకించంద్ర ఛటర్జీ రచించిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 1875 నవంబర్ 7వ తేదీన అక్షయ నవమి పర్వదినం సందర్భంగా దీనిని రచించినట్లు చెబుతారు. ఆయన నవల 'ఆనందమఠ్'లో మొదటగా ఈ గేయం వెలుగు చూసింది. ఈ నవల అప్పట్లో 'బంగదర్శన్' అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఆ తర్వాత 1882లో ఒక ప్రత్యేక పుస్తకంగా వచ్చింది.
భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలమది. జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందేమాతరం.. మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది. జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. తర్వాత కొద్ది కాలంలో ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. వందేమాతరం స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిందని ప్రకటిస్తూ, జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరానికి గౌరవం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
ఆ మాజీ క్రికెటర్ల ఇళ్లలో ఈసీ దాడులు.. రూ.11కోట్ల ఆస్తుల జప్తు
హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది?.. దీప్తి శర్మకు ప్రధాని మోదీ ప్రశ్న