Trade Disputes: మేమూ అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తాం
ABN , Publish Date - May 14 , 2025 | 05:52 AM
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉద్రిక్తతలకు గురయ్యాయి. అమెరికా స్టీల్, అల్యూమినియం దిగుమతులపై సుంకాలు పెంచడంతో, భారత్ ప్రతీకార చర్యలు తీసుకోవాలని డబ్ల్యూటీవోకి తెలియజేసింది.
డబ్ల్యూటీవోకు భారత్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మే 13: నూతన వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికాకు చెందిన కొన్ని వస్తువులపై తామూ ప్రతీకార సుంకాలను విధిస్తామని ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)కు భారత్ తెలియజేసింది. స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని అమెరికా 25 శాతానికి పెంచడంతో తాము కూడా దిగుమతి సుంకాల పెంపునకు సిద్ధమయ్యామని వెల్లడించింది. అమెరికా నుంచి భారత్‌కు అయ్యే 7.6 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ఈ ప్రతిపాదన ప్రభావం చూపనుంది. ఈ మేరకు మే 9న భారత్ నుంచి డబ్ల్యూటీవోకు ప్రతిపాదన వెళ్లింది. ఆ రోజు నుంచి 30 రోజుల తర్వాత కొత్త సుంకాలు అమలులోకి వస్తాయని ఆ ప్రతిపాదనల్లో భారత్ పేర్కొంది. అలాగే, అమెరికా తీసుకుంటున్న చర్యలు గాట్-1994(జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్), ఏవోఎస్(అగ్రిమెంట్ ఆన్ సేఫ్‌గార్డ్స్) ఒప్పందాలకు వ్యతిరేకమని భారత్ తెలిపింది. ఏవోఎస్‌లోని ఆర్టికల్ 12.3 ప్రకారం తప్పనిసరిగా నిర్వహించాల్సిన సంప్రదింపులు జరపకుండా అమెరికా చర్యలు తీసుకోవడంతో ప్రతిచర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని డబ్ల్యూటీవోకు భారత్ వెల్లడించింది. నిజానికి, 2018లో తొలిసారి దేశ అధ్యక్షుడైన ట్రంప్.. అప్పట్లో స్టీల్, అల్యూమినియం దిగుమతులపై పెద్ద ఎత్తున సుంకాలు విధించారు. మళ్లీ, రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై సుంకాన్ని 25 శాతానికి పెంచారు. మార్చి నుంచి ఈ సుంకాలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. అంతేకాక, దేశాల వారీగా, ప్రత్యేక ఉత్పత్తులపై ఇచ్చే మినహాయింపులను ఎత్తివేశారు. ఈ అధిక టారిఫ్ అంశంపై భారత్ ఏప్రిల్‌లోనే చర్చలకు ప్రయత్నించగా అమెరికా తిరస్కరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..