Share News

Donald Trump: ట్రంప్‌ మిస్టరీ!

ABN , Publish Date - May 17 , 2025 | 05:08 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు అనుకూలమా ప్రతికూలమా ఆయన నిర్ణయాలు మన దేశానికి మంచి చేసేవా చెడు చేసేవా ప్రస్తుతం ప్రతి ఒక్కరి మదిలోనూ వెన్నాడుతున్న ప్రశ్నలివి నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్లు ఇటీవలికాలంలో ఆయన నిర్ణయాలు ఉండడమే ఇందుకు కారణం.

Donald Trump: ట్రంప్‌ మిస్టరీ!

  • భారత్‌ విషయంలో చర్చనీయాంశంగా వైఖరి

  • మోదీకి ప్రాధాన్యమిస్తూనే పన్ను మోత

  • వాణిజ్య చర్చలు జరుగుతుండగానే జీరో ట్యాక్స్‌ అంటూ వ్యాఖ్యలు

  • ఐఫోన్‌ యూనిట్లను భారత్‌ నుంచి తరలించాలని యాపిల్‌కు సూచన

  • భారత్‌, పాక్‌లను ఒకేగాటన కట్టే వైఖరి

  • అమెరికాలోని భారతీయులకు భారంగా మారేలా వరుస నిర్ణయాలు

భారత్‌ విషయంలో చర్చనీయంగా అమెరికా అధ్యక్షుడి వైఖరి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు అనుకూలమా!? ప్రతికూలమా!? ఆయన నిర్ణయాలు మన దేశానికి మంచి చేసేవా!? చెడు చేసేవా!? ప్రస్తుతం ప్రతి ఒక్కరి మదిలోనూ వెన్నాడుతున్న ప్రశ్నలివి! నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్లు ఇటీవలికాలంలో ఆయన నిర్ణయాలు ఉండడమే ఇందుకు కారణం. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు మోదీకి ట్రంప్‌ ఘన స్వాగతం పలికారు. ఒప్పందాలపై సంతకాలు చేసే సమయంలో మోదీ కుర్చీ లాగి మరీ ఆయనను కూర్చోబెట్టారు. దీంతో, ట్రంప్‌ వచ్చినా భారత వాణిజ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణమే ఉంటుందని వాణిజ్యవర్గాలు భావించాయి. అంతలోనే ట్రంప్‌ పరస్పర సుంకాల వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 4న భారత్‌పైనా 26శాతం సుం కాలను ప్రతిపాదించారు. దీంతో మన స్టాక్‌ మార్కె ట్‌ కుప్పకూలింది. వారం రోజుల్లోనే ఈ సుంకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన దేశాలతోపాటు భారత్‌కూ సుంకాలపై 90 రోజుల విరామం ఇస్తున్నట్లు వెల్లడించారు.


ఈలోపులో సంప్రదింపులు జరుగుతాయని ప్రకటించారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే.. వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ తన బృందంతో అమెరికా పర్యటనకు వెళ్లడానికి ఒక్క రోజు ముందు తమ దిగుమతులపై సుంకాలన్నీ ఎత్తేస్తామంటూ భారత్‌ సూపర్‌ ఆఫర్‌ ఇచ్చిందని ట్రంప్‌ ప్రకటించారు. అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని విదేశాంగమంత్రి జైశంకర్‌ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. భారత్‌ తమకు ప్రాధాన్య దేశమని, ఆ దేశంతో వాణిజ్యం కీలకమంటూనే భారత్‌లోని ఐఫోన్‌ తయారీ యూనిట్లను అమెరికాకు తరలించాలని యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌కు ట్రంప్‌ సూచించారు. వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనాపై ట్రంప్‌ భారీ సుంకాలు వేశారు. దాంతో అక్కడ తయారు చేసిన ఐఫోన్లను దిగుమతి చేసుకోవడం అమెరికాకు భారంగా పరిణమించనుంది. దీంతో చైనా నుంచి ఫోన్ల తయారీ యూనిట్లను భారీగా భారత్‌కు తరలించాలని యాపిల్‌ నిర్ణయించింది. అంతలోనే ట్రంప్‌ బాంబు పేల్చారు. భారత్‌కు బదులుగా అమెరికాలోనే ఐఫోన్ల తయారీ యూనిట్లను నిర్మించాలని టిమ్‌ కుక్‌కు సూచించానని స్వయంగా ఆయనే వెల్లడించారు.


ట్రంప్‌ నిర్ణయంతో సంబంధంలేదని, భారత్‌లో ఐఫోన్ల తయారీ యూనిట్ల కార్యకలాపాలను కొనసాగిస్తామని యాపిల్‌ ప్రకటించినా.. ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌కు ప్రతికూలమనే వాదన వెల్లువెత్తుతోంది. పహల్గాం ఉగ్రదాడి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో.. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ ఇచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని భారత్‌ విజ్ఞప్తి చేసింది. కానీ, పాకిస్థాన్‌ 7బిలియన్‌ డాలర్లు అడిగితే తొలి విడతగా 1బిలియన్‌ డాలర్లు ఇచ్చింది. దీనిపై తీవ్రస్థాయిలోనే భారత్‌ మండిపడింది. అమెరికా మద్దతులేకుండా ఐఎంఎఫ్‌ ఈ రుణాన్ని మంజూరు చేయదనే విశ్లేషణలూ అప్పట్లో వెలువడ్డాయి. దీనిపై అమెరికా మిలటరీ వ్యూహకర్త, పెంటగాన్‌ మాజీ అధికారి మైఖేల్‌ రుబిన్‌ కూడా ట్రంప్‌ సర్కారును తీవ్రంగా తప్పుబట్టారు. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వకుండా నిలుపు చేయకపోవడం తీవ్ర తప్పిదమని, పాకిస్థాన్‌కు సాయం చేయడం ద్వారా చైనాకూ సాయం చేసినట్లేనన్నారు. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలోనూ ట్రంప్‌ వైఖరి ఇలాగే ఉంది. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో ప్రకటించారు. మరోవైపు పాకిస్థాన్‌ను భారత్‌ను; మోదీని, షెహబాజ్‌ను ఒకే గాటన కట్టారు.


రెండూ గొప్ప దేశాలని, ఇద్దరూ చరిత్రాత్మక, విరోచిత నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. రెండు దేశాలతోనూ వాణిజ్యాన్ని భారీగా పెంచుతానని ప్రకటించారు. వాణిజ్యం ఆపేస్తానని బెదిరించి పాకిస్థాన్‌తో భారత్‌ యుద్ధం చేయకుండా ఆపానన్నారు. యుద్ధసమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతుగా డ్రోన్లు, క్షిపణులు అందజేసిన విషయం తెలిసిందే. తుర్కియేకు 304మిలియన్‌ డాలర్ల క్షిపణులను విక్రయించే ఒప్పందానికి అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలికాలంలో అమెరికాలోని భారతీయులకు భారం గా పరిణమించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్ర మ వలసదారులను అత్యంత అమానవీయంగా భారత్‌కు తిరిగిపంపడంపై అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ప్రవాస భారతీయులు ఇండియాలోని తమ తల్లిదండ్రులకు పంపే నిధులపైనా పన్ను విధిస్తామని ప్రకటించారు. ఇక తొలుత చైనాతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంపై ఏకంగా 145ు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గి 30ు సుంకాలను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. చైనా, పాక్‌లతో సానుకూలంగా.. భారత్‌ విషయంలో ట్రంప్‌ ప్రతికూల వైఖరి కనబరచడం తీవ్రచర్చనీయాంశంగా మారింది.

-సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - May 17 , 2025 | 05:45 AM