గర్భిణి అనే జాలి కూడా లేకుండా.. ఇంత దారుణమా
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:23 PM
పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు పెద్దలు. చేతిలో డబ్బులుంటేనే మనిషికి విలువ. డబ్బులున్న వారికే గౌరవం, మర్యాద లభిస్తాయి. ఆఖరికి ప్రాణం కాపాడుకోవాలన్నా కూడా డబ్బే ప్రధానం. ఆ డబ్బుల మీద ఆశ నిండు గర్భిణి ప్రాణం తీసింది. ఆ వివరాలు..

ముంబై: ఏడు నెలల గర్భవతి.. ఉన్నట్లుండి నొప్పులు రావడంతో తీవ్రంగా ఇబ్బంది పడంది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాణం పోయాల్సిన వైద్యులు.. ఏకంగా పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అంత సొమ్ము లేదని చెప్పడంతో.. ఆస్పత్రిలో చేర్చుకోలేదు. ఎంత బతిమిలాడినా కనికరించలేదు. చేసేదేంలేక మరో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. చివరకు కన్ను మూసింది. పాపం ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి మురిసిపోవాల్సిన తల్లి.. వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం కారణంగా అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ సంఘటన మహారాష్ణ, పూణేలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
పూణేకు చెందిన తనిషా భిసే.. ఏడు నెలల గర్భిణి. మరో రెండు నెలలు ఆగితే కవలలకు జన్మనిచ్చేది. బిడ్డలను తలుచుకుని మురిసిపోతున్న తనిషాకు ఊహించని షాక్ తగిలింది. ఉన్నట్లుండి ఆరోగ్యం పాడయ్యింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు తనిషాను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించాల్సిన వైద్యులు కాస్త ధన పిశాచులుగా మారారు.
10 లక్షల రూపాయలు ఇస్తేనే తనిషాకు చికిత్స చేస్తామని.. లేదంటే ఆమెను అక్కడ నుంచి తీసుకెళ్లాలని తెలిపారు. వారి మాటలు విన్న తనిషా భర్త.. తన దగ్గర అంత మొత్తం లేదని.. 2.5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. కానీ ఆస్పత్రి యాజమాన్యం అందుకు అంగీకరించలేదు. తనిషాను ఆస్పత్రిలో చేర్చుకోలేదు.. చికిత్స అందించలేదు. దాంతో ఆమె పరిస్థితి మరింత విషమించింది.
చేసేదేం లేక తనిషా భర్త.. ఆమెను మరొక ఆస్పత్రికి తరలించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆలోపే ఆమె చనిపోయింది. మరో రెండు నెలల్లో కవల పిల్లలకు జన్మనివ్వాల్సిన తనిషా అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని.. ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అంతేకాక వైద్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని.. చికిత్స ఇచ్చి ఉంటే తన భార్య బతికి ఉండేదని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా తనిషా భర్త మాట్లాడుతూ.. "ఆస్పత్రి వాళ్లు.. ప్రాణం కన్నా డబ్బుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా నా భార్య చనిపోయింది. వారు కనుక వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని ఉంటే నా భార్యకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తను బతికి ఉండేది" అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా తనిషా బంధువు ఒకరు మాట్లాడుతూ.. "నేను హెల్త్ మినిస్ట్రీకి చెందిన ప్రత్యేక అధికారినని చెప్పినా సరే ఆస్పత్రి వాళ్లు తనిషాను అడ్మిట్ చేసుకోలేదు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె మరణించింది" అని చెప్పుకొచ్చాడు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఈ వార్తలను ఖండిస్తుంది. "మా ఆస్పత్రి గురించి మీడియాలో వస్తోన్న సమాచారం అసంపూర్ణం మాత్రమే కాక పూర్తిగా తప్పుడు సమాచారం. దీనిపై మేం ఓ కమిటీని వేశాం. దర్యాప్తు చేసి పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం" అని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
దేవుని ఆస్తి దోచుకోవడం దేశ ద్రోహం కంటే ఎక్కువ..
భార్య రీల్స్ పిచ్చి.. భర్త ఉద్యోగం ఊస్ట్..