భారతీయులకు ఇజ్రాయెల్ క్షమాపణలు
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:18 AM
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ రక్షణ దళాలు సోషల్ మీడియాలో పంచుకున్న ఓ పోస్టు భారతీయులకు ఆగ్రహం తెప్పించింది.
కశ్మీర్‌ను పాక్‌లో అంతర్భాగంగా చూపుతూ ‘ఎక్స్’లో చేసిన పోస్టుపై..
న్యూఢిల్లీ, జూన్ 14: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ రక్షణ దళాలు సోషల్ మీడియాలో పంచుకున్న ఓ పోస్టు భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో అంతర్భాగంగా చూపుతూ పెట్టిన ఫొటోనే ఇందుకు కారణం.. ఈ నేపథ్యంలోనే భారత పౌరులకు ఐడీఎఫ్ క్షమాపణలు చెప్పింది. టెహ్రాన్‌పై వైమానిక దాడులకు దిగిన ఐడీఎఫ్.. ‘ఇరాన్ ప్రపంచానికే ముప్పు.
ఇజ్రాయెల్ మాత్రమే దాని అంతిమ లక్ష్యం కాదు. ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు మాకు మరో మార్గం లేదు’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొంది. ప్రపంచ పటానికి సంబంధించిన ఓ ఫొటోను దానికి జత చేసింది. అయితే అందులో కశ్మీర్‌ను పాక్‌లో అంతర్భాగంగా చూపడం వివాదాస్పదమైంది. దీనిపై ఐడీఎఫ్ స్పందిస్తూ.. ‘ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను ఉదహరించే ఉద్దేశంతోనే ఆ మ్యాప్ పోస్టు చేశాం. అయితే ఆ మ్యాప్ దేశాల సరిహద్దులను కచ్చితంగా చూపలేకపోయింది. తప్పిదానికి మేం క్షమాపణలు కోరుతున్నాం’ అంటూ పేర్కొంది.