Share News

ICICI Bank Raises: ఇకపై ఐసీఐసీఐ కనీస బ్యాలెన్స్‌ రూ.50 వేలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 03:02 AM

దేశంలో ప్రయివేటు రంగంలోని రెండో అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ కొత్తగా తెరిచే సేవింగ్స్‌ ఖాతాలకు కనీస

ICICI Bank Raises: ఇకపై ఐసీఐసీఐ కనీస బ్యాలెన్స్‌ రూ.50 వేలు

  • పట్టణాల్లో కొత్త సేవింగ్స్‌ ఖాతాలకు వర్తింపు

  • చిన్న పట్టణాల్లోనైతే రూ.25 వేలు

  • జన్‌ధన్‌ ఖాతాలు ఎప్పట్లాగే జీరో బ్యాలెన్స్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశంలో ప్రయివేటు రంగంలోని రెండో అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ కొత్తగా తెరిచే సేవింగ్స్‌ ఖాతాలకు కనీస బ్యాలెన్స్‌ మొత్తాన్ని భారీగా పెంచింది. పట్టణాలు, మెట్రో నగరాల్లోని శాఖలలో కొత్తగా తెరిచే బ్యాంకు ఖాతాలకు నెల రోజుల కనీస బ్యాలెన్స్‌ రూ.50,000గా నిర్ధారించింది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో తెరిచే ఖాతాలకు రూ.25,000, రూ.10,000 చొప్పున నెల రోజుల కనీస బ్యాలెన్స్‌ను ఖరారు చేసింది. మూడు ప్రాంతాల్లోనూ కనీస బ్యాలెన్స్‌ను ఐదు రెట్లు పెంచింది. అయితే, ఆగస్టు 1 తర్వాత తెరిచిన కొత్త ఖాతాలకే ఈ నిబంధన వర్తిస్తుంది. పాత ఖాతాలకు ఎప్పట్లాగే రూ.10,000, రూ.5,000, రూ.2,000 చొప్పున కనీస బ్యాలెన్స్‌ కొనసాగుతుంది. వేతన ఖాతాలు, జన్‌ధన్‌ ఖాతాలు, డిపాజిట్ల కోసం ఉద్దేశించిన ఖాతాలకు జీరో బ్యాలెన్స్‌ వర్తిస్తుంది. నెల రోజుల కనీస బ్యాలెన్స్‌ ఖాతాలో ఉంచని వారిపై గరిష్ఠంగా రూ.500 వరకు జరిమానా విధిస్తారు. కనీస బ్యాలెన్స్‌ మొత్తానికి ఎంత తగ్గుతుందో అంత మొత్తానికి ఆరు శాతం చొప్పున వడ్డీ లెక్కించి వసూలు చేస్తారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో రూ.50,000 కనీస బ్యాలెన్స్‌ ఖాతా తెరిచిన వ్యక్తి ఒక నెలలో కేవలం రూ.45,000 కనీస బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేశాడు అనుకుందాం. మిగిలిన ఐదు వేలకు నెలకు 6 శాతం చొప్పున వడ్డీని లెక్క వేసి జరిమానాగా వసూలు చేస్తారు. అంటే, అది రూ.300 అవుతుంది. ఒక వేళ పది వేల రూపాయల లోటు ఉంటే 6 శాతం చొప్పున రూ.600 అవుతుంది. అయితే, జరిమానా గరిష్ఠ పరిమితి రూ.500 మాత్రమే కాబట్టి రూ.600 బదులు రూ.500 మాత్రమే వసూలు చేస్తారు. అస్సలు ఖాతాలో ఏమీ ఉంచకపోతే కూడా రూ.500 చొప్పున జరిమానా వసూలు చేస్తారు. జరిమానాల మీద జీఎస్టీ అదనం. కొత్త ఖాతాలకు ఎన్‌ఈఎ్‌ఫటీ నగదు బదిలీలను పరిమితి లేకుండా ఉచితంగా చేసుకొనే అవకాశం ఇచ్చారు. మూడు దఫాలుగా రూ.లక్ష వరకు నగదును ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక విధంగా ఇది ప్రీమియం బ్యాంకు ఖాతా అన్నమాట.

Updated Date - Aug 10 , 2025 | 03:02 AM