Government Policy: బాబోయ్ ఇథనాల్
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:31 AM
కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుంది ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో వ్యవహారం.
ఇ20తో తగ్గిపోతున్న పాత వాహనాల మైలేజీ.. తరచుగా రిపేర్లు
ఇంధన ఖర్చు పెరుగుతోందని యజమానుల గగ్గోలు
లోకల్‌సర్కిల్స్ సంస్థ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 13: కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుంది ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో వ్యవహారం. కాలుష్యంతో పాటు, ఇంధన దిగుమతుల వ్యయం తగ్గుతుందని పెట్రోల్‌లో ప్ర స్తుతం ఇథనాల్‌ను 20 శాతం (ఇ20) కలుపుతున్నా రు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దీనిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌తో తమ కార్ల మైలేజీ భారీగా తగ్గిపోతోందని, మరమ్మతులు ఎక్కువ గా వస్తున్నాయని వాహనదారులు గగ్గో లు పెడుతున్నారు. ఈ విషయంలో లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ ఓ సర్వే చేసింది. ఆ మేర కు.. 2022 కంటే ముందు కొనుగోలు చేసిన తమ వాహనాల మైలేజీ ఇ20 పెట్రోల్‌తో తగ్గిపోతోందని 10లో 8 మంది పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది ఇంధన ఖర్చు ఎక్కువ అయిపోతోందన్నారు. ఈ పెట్రోల్‌తో వాహనాలకు రిపేర్లు వస్తున్నాయని 52శాతం మంది చెప్పారు. ఇంజన్లు పాడైపోతున్నాయని, ట్యాంకులు, కార్బురేటర్లు చెడిపోతున్నాయన్నారు.
సర్వేలో భాగంగా దేశంలోని 323 జిల్లాల్లో 36 వేలకు పైగా వాహనాల యజమానుల అభిప్రాయాలు సేకరించారు. దీనిలో టైర్1 నగరాల నుంచి 45శాతం టైర్2 నగరాల నుంచి 27, ఇతర చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి 28 శాతం ఉన్నారు. పెట్రోల్ సంబంధిత మరమ్మతులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 40 శాతం పెరిగాయని మెకానిక్‌లు కూడా చెప్పారు.
ఇ20 వల్ల తన కారులో ఇంధనం నీరుగా మారిపోయిందని, దాని రిపేర్‌కు 4 లక్షలు ఖర్చయిందని చెన్నైలోని ఓ లగ్జరీ కార్ ఓనర్ వాపోయారు.
ఆగస్టులో సర్వే చేసినపుడు 28 శాతం మంది మాత్రమే రిపేర్ల గురించి చెప్పారు. కానీ అక్టోబరు సర్వేలో ఆ సంఖ్య 52 శాతానికి పెరిగింది.
కొనుగోలు చేసి మూడేళ్లు, ఆపైబడ్డ వాహనాల విడిభాగాలు త్వరగా పాడైపోతున్నట్లు గుర్తించా రు. ద్విచక్రవాహనాల్లో ఫ్యూయల్ ఇంజెక్టర్లు దెబ్బతింటున్నాయని, ఆయిల్ ట్యాంకులు తుప్పుపట్టిపోతున్నాయని మెకానిక్స్ వెల్లడించారు.
పెరుగుతున్న ఇథనాల్ వినియోగం
స్వచ్ఛ ఇంధనం వైపు వేసే అడుగుల్లో ఇ20 ఓ భాగమని, దీంతో రైతులకు లాభాలు చేకూరతాయం టూ పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని పెంచడాన్ని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. 2024 నాటికి ప్రపంచ రవాణా ఇంధనంలో ఇథనాల్ మిశ్రమం వాటా 5 నుంచి 6 శాతంగా ఉంది. గతేడాది నాటికి ఇథనాల్ మార్కెట్ విలువ 98.5 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఏటా 6.9ు పెరుగుదలతో 2035 నాటికి ఆ మార్కెట్ విలువ 205.2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.