UAE Visit Visa Scam: పెళ్లాడి గర్భవతిని చేసి ముఖం చాటేసి
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:33 AM
యూఏఈలో విజిట్ వీసాపై ఉన్న హైదరాబాద్ యువతిని పాకిస్థాన్ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసి వీసా గడువు ముగిసిన తర్వాత ఆమెను భారతదేశానికి పంపాడు. బాధితురాలు సహాయం కోసం భారత ఎంబసీ వద్ద ఆశ్రయం కోరింది.
వీసా ఇప్పిస్తానని హైదరాబాద్ యువతిని యూఏఈలో మోసం చేసిన పాక్ వ్యక్తి
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
విజిట్ వీసాపై యూఏఈ వెళ్లిన హైదరాబాద్ యువతిపై అక్కడ పాకిస్థాన్ యువకుడు కన్నేశాడు. ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి చేసుకుని ఆమెను గర్భవతిని చేశాడు. వీసా గడువు ముగియడంతో ఆమెను హైదరాబాద్‌కు పంపి అతడు ముఖం చాటేశాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని దోమలగూడకు చెందిన 22 ఏళ్ల యువతి గత ఏడాది విజిట్ వీసాపై యూఏఈకి వచ్చింది. అబుధాబీలోని సూపర్ మార్కెట్‌లో పని చేసే ఆమెకు పాకిస్థాన్ యువకుడు(30) పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. తల్లిదండ్రులు లేని ఆమె పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు రెగ్యులర్ వీసాను ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఆమెను అబుధాబీ న్యాయ స్థానంలో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల కాపురం అనంతరం ఆమె గర్భం దాల్చింది. అయితే, ఆమె విజిట్ వీసాను రెన్యువల్ చేయకుండా యువకుడు తప్పుదారి పట్టించాడు. తాను శాశ్వత వీసా పంపిస్తానని మభ్యపెట్టి ఆమెను హైదరాబాద్‌కు పంపించాడు. నెలలు గడుస్తున్నా యువతికి వీసా రాలేదు. యువకుడిని గట్టిగా నిలదీయడంతో ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో ఆమె మోసపోయానని గ్రహించింది. అదే సమయంలో తాను గర్భవతినని తెలుసుకుని ఆందోళనకు గురైంది. శత విధాలుగా ప్రయత్నాలు చేసిన అనంతరం యువకుడు అందుబాటులోకి వచ్చాడు. విజిట్ వీసా గడువు ముగిసిన తర్వాత వెళ్లినందున మళ్లీ యూఏఈకి రావడానికి నిబంధనలు ఒప్పుకోవని, పొరుగున ఉన్న ఖతార్‌కు వస్తే తాను కలుస్తానని చెప్పాడు. దీంతో ఆమె హైదరాబాద్ నుండి రెండు రోజుల వీసాపై ఖతార్ వచ్చింది. యువకుడికి ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో మళ్లీ మోసపోయానని గ్రహించింది. సహాయం కోసం భారత ఎంబసీకి పరిగెత్తింది. అధికారుల సూచనతో ఆ యువతి శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లిపోయింది.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి