Share News

Electricity Demand: 2026లో 19వేల మెగావాట్ల డిమాండ్‌

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:13 AM

రానున్న రబీ సీజన్‌తో పాటు వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ అన్నారు.

Electricity Demand: 2026లో 19వేల మెగావాట్ల డిమాండ్‌

  • దీనికి అనుగణంగా ఏర్పాట్లు చేసుకోవాలి

  • డీటీఆర్‌, ఫీడర్ల ఆటోమేషన్‌చేయాలి

  • ఈవీ హబ్‌గా హైదరాబాద్‌:నవీన్‌ మిత్తల్‌

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రానున్న రబీ సీజన్‌తో పాటు వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ అన్నారు. 2026లో విద్యుత్‌ డిమాండ్‌ 19 వేల మెగావాట్లకు చేరనుందని అంచనా వేశారు. దక్షిణ డిస్కమ్‌ ప్రధాన కార్యాలయంలో జెన్‌కో ట్రాన్స్‌కో, దక్షిణ డిస్కమ్‌, ఉత్తర డిస్కమ్‌, రెడ్‌కో, సింగరేణి ఉన్నతాధికారులతో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది గరిష్ఠ డిమాండ్‌ 17,162 మెగావాట్లకు చేరినా విద్యుత్‌ను అందించగలిగామని చెప్పారు. వచ్చే ఏడాది గరిష్ఠ డిమాండ్‌ 19 వేల మెగావాట్లకు మించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రబీ ప్రారంభానికి ముందే లైన్ల మరమ్మతులు, కొత్త ట్రాన్స్‌ ఫార్మర్ల ఏర్పాటుతో పాటు, ఇతర అభివృద్ధి పనులన్నీ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ అందించడానికి వీలుగా కొత్త లైన్లతో పాటు 33/132/220/400 కేవీ సబ్‌ స్టేషన్లలోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాలన్నారు. తెలంగాణ జెన్‌కో పరిధిలోని విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లలో ఓవర్‌ హాలింగ్‌ దాదాపుగా అన్ని యూనిట్లలో పూర్తయిందని, మరికొద్ది నెలల్లో 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్‌లో విద్యుత్‌ ఉత్పాదన పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎల్‌టీ 11కేవీ నెట్‌వర్క్‌ స్థాయిలో ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల నిర్వహణలో ఆటోమేషన్‌ విధానం అమలులోకి తీసుకురావాలని డిస్కమ్‌ల సీఎండీలను ఆదేశించారు. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన స్కాడా తరహా సాంకేతికతను గ్రామాలకు సైతం విస్తరింపజేయాలన్నారు.పీఎం-ఈ డ్రైవ్‌లో భాగంగా ఎలక్ట్రికల్‌ వాహనాల చార్జింగ్‌ కేంద్రాలకు ఇస్తున్న రాయితీలను ప్రభుత్వ రంగ సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Oct 26 , 2025 | 04:13 AM