UP: వృద్ధులను కట్టేసి.. గదుల్లో బంధించి..
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:28 AM
అదో వృద్ధాశ్రమం! లోపల నేలమాళిగల్లాంటి గదుల్లో ముక్కు పుటలు అదిరిపోయేంత దుర్గంధం! అక్కడ చిమ్మచీకట్లో మలమూత్రాల మధ్య వయసు మళ్లిన వాళ్లంతా పడి ఉన్నారు.
నోయిడాలోని వృద్ధాశ్రమంలో దుర్భర స్థితిలో వృద్ధులు
న్యూఢిల్లీ, జూన్ 27: అదో వృద్ధాశ్రమం! లోపల నేలమాళిగల్లాంటి గదుల్లో ముక్కు పుటలు అదిరిపోయేంత దుర్గంధం! అక్కడ చిమ్మచీకట్లో మలమూత్రాల మధ్య వయసు మళ్లిన వాళ్లంతా పడి ఉన్నారు. మగవాళ్లలో కొందరికి ఒంటిమీద సరైన వస్త్రాల్లేవు. మహిళల్లో కొందరిది ఇదే దైన్యం! కొందరికి చేతులు కట్టేశారు. బాధితులనంతా గదుల్లో పెట్టి లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా బయట నుంచి తాళాలు వేశారు. యూపీ నోయిడాలోని సెక్టార్-55లోని ఆనంద్ నికేతన్ అనే పేరుతో నడుస్తున్న వృద్ధాశ్రమంలో 40 మంది వృద్ధుల పరిస్థితి ఇది! ఇంట్లో సరైన ఆదరణ కరువైన స్థితిలో ఆశ్రమంలోనైనా జీవన మలిసంధ్యను సంతోషంగా గడపొచ్చునని ఆశపడ్డ వృద్ధులు ఇలా అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆశ్రమ నిర్వాహకులు డొనేషన్ కింద వృద్ధుల కుటుంబాల నుంచి రూ.2.5 లక్షల చొప్పున తీసుకున్నారు.
వసతి, భోజనం ఖర్చుల కింద నెలకు రూ.6వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఆశ్రమంలో ఓ మహిళను కట్టేసి, గదిలో బంధించిన తాలూకు వీడియో ఒకటి నెట్‌లో వైరల్‌గా మారడంతో యూపీ మహిళా కమిషన్, ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ విభాగం అధికారుల సమక్షంలో వృద్ధాశ్రమంపై సిబ్బంది దాడులు నిర్వహించారు. అక్కడున్న ఓ మహిళా ఉద్యోగిని అధికారులు ప్రశ్నించగా తాను నర్సునని చెప్పింది. వృద్ధాశ్రమాన్ని అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఆశ్రమంలోని దారుణ పరిస్థితులపై బాధిత కుటుంబాల నుంచి ఎవ్వరూ నోరువిప్పకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆశ్రమాన్ని సీజ్ చేసిన అధికారులు..అందులోని 40 మంది వృద్ధులను రక్షించి.. అక్కడి నుంచి తరలించారు.