నేరాన్ని అంగీకరించిన సోనమ్!
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:23 AM
హనీమూన్ హత్యకేసులో నిందితురాలు సోనమ్ పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని సోనమ్ ఒప్పుకొన్నట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
పెళ్లి ఇష్టం లేకనే భర్త రాజా రఘువంశీ హత్య
దర్యాప్తులో పాల్గొన్న ఓ పోలీసు అధికారి వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 11: హనీమూన్ హత్యకేసులో నిందితురాలు సోనమ్ పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని సోనమ్ ఒప్పుకొన్నట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. షిల్లాంగ్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు సోనమ్ పథకం ప్రకారమే వెనుకబడిపోయిందని, రాజా రఘువంశీ కోసం కొండపైన అప్పటికే కాపు కాసి ఉన్న మిగతా ముగ్గురు నిందితులు అతన్ని కత్తితో పొడిచి చంపేశారని వివరించారు. హత్యకు ముందు సోనమ్ ‘అతన్ని చంపేయండి’ అంటూ నిందితులను ప్రోత్సహించిందని పేర్కొన్నారు. రఘువంశీతో పెళ్లి సోనమ్‌కు ఇష్టం లేదని, ఆమెకు అప్పటికే రాజ్ కుశ్వాహాతో ప్రేమలో ఉందని వివరించారు. ఈ కేసులో సోనమ్‌తో పాటు మిగతా నిందితులను బుధవారం పోలీసులు షిల్లాంగ్ తీసుకువెళ్లారు. కాగా, షిల్లాంగ్ కోర్టు సోనమ్, మిగతా నిందితులకు 8రోజుల పోలీసు కస్టడీ విధించింది.
మరోవైపు, సోనమే హత్యకు కుట్ర పన్నిందని ఆమె సోదరుడు గోవింద్ తేల్చి చెప్పాడు. గోవింద్ బుధవారం రాజా రఘువంశీ కుటుంబసభ్యులను కలిసి ఓదార్చాడు. న్యాయపోరాటంలో వారికి అండగా ఉంటానన్నాడు. సోనమ్‌కు రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేదని, రాజ్ కుశ్వాహాను పెళ్లి చేసుకుంటానని ఆమె ముందే తన తల్లితో చెప్పిందని, అందుకు తల్లి ఒప్పుకోలేదని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ ఆరోపించాడు. అప్పుడే సోనమ్.. ‘‘ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో చూడు’’ అంటూ తల్లిని హెచ్చరించిందన్నాడు. ఈ విషయాన్ని సోనమ్ సోదరుడు గోవిందే తనకు చెప్పాడని పేర్కొన్నాడు.