Heavy Rain Hits Hyderabad: హైదరాబాద్ శివార్లలో భారీ వర్షం
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:21 AM
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కురిసిన భారీవర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం
పలు జిల్లాల్లో వర్షాలు
తుపాను ప్రభావంతో రేపటి నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్ : హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కురిసిన భారీవర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోత వర్షంతో చందానగర్, ఆర్సీపురం, గచ్చిబౌలి, షేక్‌పేట ప్రాంతాల్లో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. శేరిలింగంపల్లి సుదర్శన్‌కాలనీలో ప్రధాన రహదారులపై వరద నీరు పోటెత్తడంతో రెండు ద్విచక్రవాహనాలు వరదలో కొట్టుకుపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. చందానగర్‌లో అత్యధికంగా 5.3 సెం.మీ వర్షం కురిసింది. లింగంపల్లి అండర్ బ్రిడ్జిని వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయియి. గచ్చిబౌలి, అమీర్‌పేట, చందానగర్, హఫీజ్‌పేట ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఆమనగల్లు మార్కెట్ యార్డులో ఆరబెట్టిన మొక్కజొన్న వర్షానికి తడిసి రైతులు ఇబ్బంది పడ్డారు. నందిగామ మండలంలో శనివారం కురిసిన వర్షానికి పత్తి పంట తడిసి ముద్దయింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు భారీవర్షం కురిసింది. పత్తి పంటకు మరింత నష్టం వాటిల్లింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్, పోచారం మున్సిపాలిటీల పరిధిలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలో అత్యధికంగా 81 మి.మీ. వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా కొత్తకోటలో 59.4, నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో 56.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం వాయుగుండంగా మారింది. ఆదివారానికి ఇది తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం నాటికి తుపానుగా మారి, 28వ తేదీ సాయంత్రానికి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఆ సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 27 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ యెల్లో అలెర్ట్ జారీ చేసింది.