Haryana Government Suspends: రోహ్‌తక్ ఎస్పీపై బదిలీ వేటు
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:46 AM
తన భర్త సూసైడ్ నోట్‌లో పేర్లు ప్రస్తావించిన అధికారులందరినీ విధుల నుంచి తప్పించాలని, అరెస్టు చేయాలని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ భార్య అమనీత్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.......
బిజార్ణియాపై హరియాణా ప్రభుత్వం చర్యలు
ఐపీఎస్ పూరన్ కుమార్ భార్యకు సోనియా లేఖ
న్యాయ పోరాటంలో అండగా ఉంటానని భరోసా
న్యూఢిల్లీ/చండీగఢ్, అక్టోబరు 11: తన భర్త సూసైడ్ నోట్‌లో పేర్లు ప్రస్తావించిన అధికారులందరినీ విధుల నుంచి తప్పించాలని, అరెస్టు చేయాలని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ భార్య అమనీత్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై హరియాణా ప్రభుత్వం శనివారం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సురిందర్ సింగ్‌ను నియమిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వు పేర్కొంది. బిజార్ణియా పోస్టింగ్ ఆర్డర్‌ను విడిగా జారీచేయనున్నట్లు తెలిపింది. అయితే పూరన్ కుమార్ మృతి కేసును ఇందులో ప్రస్తావించలేదు. మరోవైపు డీజీపీ శత్రుజీత్‌ను కూడా దీర్ఘకాల సెలవుపై పంపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, పంచకులలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నాయబ్ సింగ్ సైనీ మాట్లాడుతూ ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, దోషులుగా తేలిన వారిపై స్థాయితో సంబంఽధం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు. మానసిక వేధింపులు, కులవివక్ష కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పూరన్ కుమార్ రాసిన తన సూసైడ్ నోట్‌లో డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పేర్కొన్నారు.
తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యా..: సోనియా
పూరన్ కుమార్ భార్య అమనీత్‌కు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. పూరన్ ఆత్మహత్య విషయం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని, తీవ్ర బాధ కలిగించిందన్నారు. ‘‘న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటంలో కోట్లాది మంది భారతీయులతో పాటు నేను కూడా అండగా ఉంటాను’’ అని లేఖలో తెలిపారు. మరోవైపు, పూరన్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఇంకా సమ్మతి తెలపలేదు. కొన్ని ఫిర్యాదుల కారణంగా ఆయన కుటుంబసభ్యులు పోస్టుమార్టానికి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారని, వాటిని పరిష్కరించేందుకు చర్చలు జరుగుతున్నాయని చండీగఢ్ డీజీపీ చెప్పారు.