Haryana DGP Case Filed: హరియాణా డీజీపీపై కేసు
ABN , Publish Date - Oct 10 , 2025 | 03:25 AM
చండీగఢ్, అక్టోబరు 9: హరియాణా దళిత ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్‌తో పాటు రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాపై కేసు నమోదైంది.
సీఎంకు దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అమనీత్ లేఖతో ఎట్టకేలకు కేసు
తన భర్తకు ఆత్మహత్యకు డీజీపీ శత్రుజీత్ కపూర్, ఎస్పీ నరేంద్రలే కారణమని అమనీత్ ఆరోపణ
చండీగఢ్, అక్టోబరు 9: హరియాణా దళిత ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్‌తో పాటు రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాపై కేసు నమోదైంది. తన భర్త బలవన్మరణానికి డీజీపీ, ఎస్పీలే కారణమని కుమార్ భార్య, ఐఏఎస్ అధికారిణి అమనీత్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చండీగఢ్ ఎస్‌ఎస్పీ ధ్రువీకరించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స)తో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. పలువురు సీనియర్ అధికారుల కుల వివక్ష, మానసిక వేధింపులు భరించలేక కుమార్ మంగళవారం చండీగఢ్‌లోని ఇంట్లో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను ఎవరెవరు ఎలా వేధించిందీ అవమానించిందీ కుమార్ 8 పేజీల సూసైడ్ నోట్‌లో రాశారు. అందులో కొందరు రిటైర్డ్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో జపాన్ పర్యటనలో ఉన్న అమనీత్.. వెంటనే చండీగఢ్ బయలుదేరి వచ్చారు. బుధవారం రాత్రే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ, ఎస్పీలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె గురువారం సీఎం నాయబ్ సింగ్ సైనీకి ఘాటు లేఖ రాశారు. దాంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. తన భర్త సూసైడ్ నోట్ ఉన్నా.. తాను ఫిర్యాదు చేసినా నిందితులు శక్తిమంతులు కావడంతో కేసు నమోదు చేయలేదని అమనీత్ తన లేఖలో విమర్శించారు. దళితుడివంటూ కుమార్‌ను సూటిపోటి మాటలతో అవమానించేవారని ఆమె పేర్కొన్నారు. తన కుటుంబానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని సీఎంను కోరారు. 2001 బ్యాచ్ హరియాణా క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. అమనీత్ కూడా 2001 బ్యాచ్‌కే చెందిన ఐఏఎస్ అధికారిణి.