Hanif Abbasi Threatens India: 130 అణుమిసైళ్లను భారత్ వైపు గురిపెట్టి రెడీగా ఉంచాం: పాక్ మంత్రి
ABN , Publish Date - Apr 27 , 2025 | 10:57 AM
పాక్‌కు నీటి సరఫరా నిలిచిపోయిన పక్షంలో భారత్ యుద్ధానికి రెడీ కావాలని దాయాది దేశ మంత్రి హనీఫ్ అబ్బాసీ వార్నింగ్ ఇచ్చారు. తమ అణ్వాయుధాలను భారత్‌కు గురిపెట్టి రెడీగా ఉంచామని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి తరువాత భారత్ సింధూ నదీ జలాల ఒప్పందం నిలుపుదల చేయడంతో పాక్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముంచు కొస్తున్న నీటి కొరత చూసి భయపడిపోతున్న పాక్ నేతలు పిచ్చి కూతలకు దిగుతున్నారు. సింధూ నదిలో ప్రత్యర్థుల రక్తం పారుతుందని నిన్న బిలావాల్ భుట్టో రెచ్చగొట్టగా.. తాజాగా మరో పాక్ మంత్రి తన వాచాలతను ప్రదర్శించారు. 130 అణు వార్‌హెడ్‌లను భారత్‌కు గురిపెట్టి సిద్ధంగా ఉంచామంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు.
సింధూ నదీ జలాలను అడ్డుకుంటే భారత్‌పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామంటూ పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ హెచ్చరించారు. పూర్తిస్థాయి యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. పాక్ అణ్వాయుధాలు జనాలకు ప్రదర్శించడం కోసం కాదని అన్నారు. పాక్‌లో ఎవ్వరికీ తెలియని ప్రాంతాల్లో వాటిని దాచి ఉంచామని, అవసరమైతే ప్రయోగిస్తామని అన్నారు.
‘‘వాళ్లు నీటి సరఫరాను నిలిపి వేస్తే యుద్ధానికి సిద్ధం కావాలి. మా మిలిటరీ సామగ్రి, ఆయుధాలను ప్రదర్శన కోసం పెట్టుకోలేదు. మా అణ్వాయుధాలు ఏయే ప్రాంతాల్లో దాచామో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మరోసారి చెబుతున్నా.. ఈ మిసైల్స్‌ను మిపై గురిపెట్టి సిద్ధంగా ఉంచాము’’ అంటూ నోటికొచ్చినట్టు రెచ్చిపోయారు.
పహల్గాం దాడి తరువాత భారత్ పాక్‌పై తీవ్ర చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. దాయాది దేశంతో అన్ని రకాల దౌత్య, వాణిజ్య బంధాలను తెంచుకోవడంతో పాటు పాక్ నీటి భద్రతకు కీలకమైన 1960ల నాటి సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని కూడా నిలుపుదల చేసింది.
ఈ పరిణామాలపై అబ్బాసీ మాట్లాడుతూ పాక్ గగనతలాన్ని మూసేయడంతో భారత వైమానిక రంగంలో కలకలం రేగిందని అన్నారు. కేవలం రెండు రోజులకే భారత్ ఇరకాటంలో పడిందని అన్నారు. ‘‘పరిస్థితి మరో 10 రోజుల పాటు ఇలాగే కొనసాగితే భారతీయ ఎయిర్‌లైన్స్ దివాలా తీస్తాయి’’ అని అన్నారు.
భారత్ తన భద్రతా వైఫల్యాన్ని అంగీకరించకుండా పహల్గాం దాడి నెపాన్ని పాక్‌పై నెడుతోందని కూడా అన్నారు. భారత్‌తో వాణిజ్య నిలుపుదలతో ఏర్పడే పరిణామాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పాశ్చాత్య దేశాల కోసమే తాము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సి వస్తోందని అంతకు ఒక రోజు ముందే పాక్ ప్రధాని అంగీకరించిన తరువాత అబ్బాసీ ఈ ప్రకటన చేయడం కొసమెరుపు.
ఇవి కూడా చదవండి..
రాక్షసత్వం ప్రబలితే.. పహల్గాం దాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ రియాక్షన్
అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు
అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య
Read Latest and International News