Modi Speech: దీపావళికి జీఎస్టీ బొనాంజ!
ABN , Publish Date - Aug 16 , 2025 | 05:36 AM
దేశంలో దీపావళికి ‘జీఎస్టీ’ పండగ రానుంది. పేదలు, మధ్య తరగతి, చిన్న పరిశ్రమలకు పన్నుల నుంచి ఉపశమనం కలిగించేలా.. ఇప్పుడున్న నాలుగు జీఎస్టీ శ్లాబులను రెండింటికి తగ్గించేందుకు రంగం సిద్ధమైంది.
పండుగకు గొప్ప కానుక అందిస్తా..
సంస్కరణలతో ధరాభారం తగ్గిస్తా: ప్రధాని
ఇక 5%, 18%.. రెండు శ్లాబుల్లోనే పన్ను?
దాదాపు వస్తుసేవలన్నీ వీటిలోనే సర్దుబాటు
నిత్యావసరాల ధరలు బాగా తగ్గే అవకాశం
ఆరోగ్య, టెర్మ్ బీమా ప్రీమియం దిగొచ్చే వీలు
విలాసవంతమైన, హానికర ఉత్పత్తులపై
మాత్రం 40ు ప్రత్యేక పన్ను రేటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రయోజనం
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ
వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో
సంస్కరణలపై తుది నిర్ణయం
న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలో దీపావళికి ‘జీఎస్టీ’ పండగ రానుంది. పేదలు, మధ్య తరగతి, చిన్న పరిశ్రమలకు పన్నుల నుంచి ఉపశమనం కలిగించేలా.. ఇప్పుడున్న నాలుగు జీఎస్టీ శ్లాబులను రెండింటికి తగ్గించేందుకు రంగం సిద్ధమైంది. జీఎస్టీలో కేవలం 5శాతం, 18శాతం పన్నురేట్లే కొనసాగనున్నాయి. 12శాతం, 28శాతం పన్ను రేట్లను తొలగించి, వాటి పరిధిలో ఉన్న వస్తుసేవలను.. 5, 18శాతం శ్లాబ్‌లలో సర్దుబాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటన చేశారు. ‘‘దీపావళికి గొప్ప బహుమతి ఇవ్వబోతున్నా.. జీఎస్టీతో సంస్కరణలు తెచ్చి గత ఎనిమిదేళ్లలో పన్నుల విధానాన్ని సులభతరం చేశాం. ఇప్పుడు దీనిని సమీక్షించాల్సిన సమయం వచ్చింది. దీనిపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాం. జీఎస్టీలో భారీ సంస్కరణలను ప్రవేశపెట్టనున్నాం. ఇది దీపావళి బహుమతి. అత్యవసర సర్వీసులపై పన్నులు దిగివస్తాయి. సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసరాల ధరలు తగ్గుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి. మన ఆర్థిక వ్యవస్థకు మంచి ఊపు వస్తుంది..’’ అని మోదీ పేర్కొన్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏయే పన్ను రేట్లు ఉంటాయన్నది నేరుగా పేర్కొనకుండా.. సాధారణ, మెరిట్ శ్లాబులు, కొన్నిరకాల వస్తువులపై ప్రత్యేక పన్నురేట్లను ప్రతిపాదించామని తెలిపింది. జీఎస్టీలో నిర్మాణాత్మక మార్పులు, పన్నురేట్ల హేతుబద్ధీకరణ, పన్నులు-రీఫండ్స్ విధానాలను సులభతరం చేయడమనే మూడు పిల్లర్లతో కూడిన సంస్కరణలు చేపట్టాలని కోరామని వెల్లడించింది.
జీఎస్టీ కౌన్సిల్‌లో తుది నిర్ణయం..
జీఎస్టీని సరళతరం చేయడంలో భాగంగా ప్రస్తుతమున్న 12శాతం, 28శాతం శ్లాబులను తొలగించి.. వాటి పరిధిలోని వస్తుసేవలను మిగతా శ్లాబుల్లో సర్దుబాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించింది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెలలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.ప్రస్తుతం జీఎస్టీలో పన్ను మినహాయింపు పొందిన వస్తుసేవలు కాకుండా.. 5%, 12%, 18%, 28శాతం పన్ను రేట్లు ఉన్నాయి. ఇకపై 5శాతం, 18శాతం పన్నురేట్లను మాత్రమే కొనసాగిస్తూ.. మిగతా శ్లాబుల్లోని వస్తుసేవలను ఈ పన్ను రేట్లలోనే సర్దుబాటు చేయనున్నట్టు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. విలాసవంతమైన వస్తుసేవలతోపాటు సమాజంపై చెడు ప్రభావాలు కలిగించే (సిన్ గూడ్స్) పొగాకు ఉత్పత్తులు సహా ఏడింటిపై 40శాతం ప్రత్యేక పన్నురేటు విధించనున్నట్టు వెల్లడించాయి. జీఎస్టీ చట్టం ప్రకారం గరిష్టంగా 40శాతం పన్ను విధించవచ్చని వివరించాయి. జీఎస్టీ శ్లాబ్‌ల కుదింపు నేపథ్యంలో.. 12 శాతం పన్నురేటులో ఉన్న వస్తుసేవల్లో 99శాతం మేర 5శాతం పన్ను పరిధిలోకి... 28శాతం పన్నురేటులో ఉన్న వస్తుసేవల్లో 90శాతం మేర 18శాతం పన్ను పరిధిలోకి వస్తాయని అంచనా. పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం పన్నులు, సర్‌చార్జీలు వంటివన్నీ కలిపి 88శాతం పన్ను వసూలు చేస్తున్నారని.. ఇలాంటి ‘సిన్ గూడ్స్’ ధరలు తగ్గకుండా ప్రత్యేక పన్నులు, చార్జీలు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఏయే ఉత్పత్తులు, సేవలను.. ఏ శ్లాబుల్లోకి మార్చేదీ పూర్తి స్పష్టత రావాల్సి ఉందని వివరించాయి. ప్రస్తుతం జీఎస్టీ రాబడిలో 65శాతానికిపైగా 18శాతం పన్నురేటు ఉన్న వస్తుసేవల నుంచే సమకూరుతోంది. 28శాతం శ్లాబ్ నుంచి 11శాతం ఆదాయం, 5శాతం శ్లాబ్ నుంచి ఏడు శాతం ఆదాయం, 12శాతం శ్లాబ్ నుంచి ఐదుశాతం ఆదాయం వస్తోంది.
పన్నులు తగ్గినా.. వినియోగానికి ఊపు!
జీఎస్టీ శ్లాబుల కుదింపుతో ప్రజలు రోజువారీ వినియోగించే వస్తుసేవల ధరలు తగ్గుతాయని.. ప్రస్తుతానికి జీఎస్టీ ఆదాయం తగ్గుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ధరలు తగ్గడంతో ప్రజల వినియోగం పెరుగుతుందని, దానితో జీఎస్టీ ఆదాయం మళ్లీ పెరుగుతుందని అంటున్నారు. జీఎస్టీ శ్లాబుల్లో మార్పులతో వ్యవసాయం, ఆరోగ్యం, బీమా, చేతి వృత్తులు, వస్త్ర పరిశ్రమ, ఎరువులు, పునరుత్పాదక ఇంధనం, వాహన రంగాలకు ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. ట్రంప్ సుంకాలు, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల్లో దేశీయంగా వినియోగాన్ని పెంచడానికి సరైన సమయంలో జీఎస్టీ సంస్కరణల నిర్ణయం తీసుకున్నారని పన్ను సేవల సంస్థ ఈవై ఇండియా ప్రతినిధి సౌరభ్ అగర్వాల్ పేర్కొన్నారు.
దీపావళి తర్వాత ధరలు తగ్గేవి ఇవే?
ప్రస్తుతం 12శాతం శ్లాబ్‌లో ఉన్న నిత్యావసరాల్లో చాలా వరకు 5శాతం శ్లాబ్‌లోకి మార్చే అవకాశం ఉంది. దానితో వాటి ధరలు తగ్గుతాయి. ఇందులో ప్యాకేజ్ చేసిన పాలు, బటర్, పనీర్, నెయ్యి, పళ్లరసాలు, బాదాం ఇతర డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, జామ్, సబ్బులు, టూత్‌పేస్టులు, హెయిర్ ఆయిల్, గొడుగులు, ప్రాసెస్ చేసిన ఆహారం, కుట్టు మిషన్లు, సాధారణ వాటర్ ఫిల్టర్లు (ఎలక్ట్రిక్ కానివి), అల్యూమినియం, స్టీలు పాత్రలు, కుక్కర్లు, ఇస్త్రీపెట్టెలు, గీజర్లు, చిన్న వాక్యూమ్ క్లీనర్లు, రూ.1000 కన్నా ఖరీదైన రెడీమేడ్ వస్త్రాలు, రూ.1000 ధరలోపు పాదరక్షలు, రబ్బర్ బ్యాండ్‌లు, హ్యాండ్ బ్యాగులు, వైద్య పరీక్షల కిట్లు, సైకిళ్లు, వ్యవసాయ యంత్రాల ధరలు తగ్గే అవకాశం ఉంది.
ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు, మధ్యస్థాయి లాడ్జీలు, హోటళ్లలో గదుల అద్దె వంటివి కూడా 12శాతం పన్నురేటులో ఉన్నాయి. వీటిని 5శాతం శ్లాబ్‌లోకి తెస్తే ధరలు బాగా తగ్గుతాయి. అదే 18శాతం శ్లాబ్‌లోకి మార్చితే ధరలు పెరుగుతాయి.
ప్రస్తుతం ఆరోగ్య, టెర్మ్, ఇతర బీమా పాలసీల ప్రీమియంపై 18శాతం పన్ను ఉంది. దీనిని తగ్గించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. తాజా సంస్కరణల్లో భాగంగా 5శాతానికి తగ్గించవచ్చనే అంచనాలు ఉన్నాయి.
సిమెంటు, రెడీమిక్స్ కాంక్రీట్, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, 32 అంగుళాలకుపైన ఉన్న ఎల్‌ఈడీ టీవీలు, ప్రింటర్లు, రేజర్లు, వాణిజ్యపరమైన ప్లాస్టిక్ ఉత్పత్తులు, కార్లు, ఖరీదైన ద్విచక్రవాహనాలు వంటివి ప్రస్తుతం 28శాతం శ్లాబ్‌లో ఉన్నాయి. వీటిని 18శాతం శ్లాబ్‌కు మార్చితే ధరలు బాగా తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవి పెరగొచ్చు!
జీఎస్టీ పన్ను రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘానికి, జీఎస్టీ కౌన్సిల్‌కు గతంలో పలు ప్రతిపాదనలు వచ్చాయి. ఖరీదైన రెడీమేడ్ దుస్తులు, వాచీలు, బూట్లు, కూల్ డ్రింకులు, ఖరీదైన కార్లు వంటివాటిపై పన్నులు పెంచాలనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ శ్లాబుల మార్పుల్లో భాగంగా వీటిని ప్రత్యేక పన్ను రేటు పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇక వజ్రాలు, ఇతర రత్నాలపై పన్నులు కూడా తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు.