Greenfield Road: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూసేకరణకు డిక్లరేషన్
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:24 AM
ఔటర్ రింగురోడ్డు రావిర్యాల జంక్షన్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా రీజినల్ రింగురోడ్డు వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం గతంలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా డిక్లరేషన్ ప్రకటించింది.
తొలివిడతలో 396.27 ఎకరాల నిర్ధారణ
(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి), అక్టోబరు 25: ఔటర్ రింగురోడ్డు రావిర్యాల జంక్షన్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా రీజినల్ రింగురోడ్డు వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం గతంలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా డిక్లరేషన్ ప్రకటించింది. తొలి విడత నిర్మించే 110మీటర్ల వెడల్పు, 18.5కి.మీ పొడవైన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు 396.27 ఎకరాలను సేకరిస్తున్నట్లు డిక్లరేషన్‌లో వెల్లడించింది. ఇక్కడ 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి వెంటే మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మహేశ్వరం మండలంలోని కొంగర ఖుర్ధ్ గ్రామంతో పాటు ఇబ్రహీంపట్నం మండలంలోని ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్, కందుకూరు మండలంలోని లేమూరు, రాచలూరు, తిమ్మాపూర్, గుమ్మడివెల్లి, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టింది. భూసేకరణ చట్టం ప్రకారం హేతుబద్దమైన పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. వంద శాతం నష్టపోతున్న కొంగరకుర్ధు గ్రామానికి చెందిన 2కుటుంబాలకు పునరావాసం కింద రూ.5,60,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నారు.