Indian Constitution: రాజ్యసభలో రాజ్యాంగంపై వాడీవేడి చర్చ
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:24 AM
ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

న్యూఢిల్లీ, పిబ్రవరి 11: పార్లమెంట్ చేసిన సవరణలతో పాటు 22 సూక్ష్మ చిత్రాలను కలిగి ఉన్న, దాని రూపకర్తలు సంతకం చేసిన రాజ్యాంగాన్ని మాత్రమే ప్రామాణికమైనదిగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా తొలగించిన ఒరిజినల్ చిత్రాలను తిరిగి చేర్చాలని ధన్‌ఖడ్ డిమాండ్ చేశారు. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన రాజ్యాంగ ప్రతుల్లో 22 సూక్ష్మచిత్రాలు గల్లంతయ్యాయనే అంశాన్ని బీజేపీ ఎంపీ రాధామోహన్ దాస్ అగర్వాల్ ప్రస్తావించారు. వాటిలో రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు, సామ్రాట్ విక్రమాదిత్య, ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ తదితర చిత్రాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై ఖర్గే మాట్లాడుతూ ‘రాజ్యాంగంపై వివాదాన్ని సృష్టించడానికే బీజేపీ ఈ అంశాన్ని అనవసరంగా లేవనెత్తుతోందన్నారు. అంబేడ్కర్, పటేల్, ఇతరులు జీవించి ఉన్నప్పుడు దీనిపై ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు కొత్త సమస్యలు తెస్తున్నారు. ఇది అంబేడ్కర్‌ను కించపరిచే ప్రయత్నం’ అని ఆరోపించారు. నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.