Operation Sindoor: రక్షణ రంగానికి మరో 50వేల కోట్లు!
ABN , Publish Date - May 17 , 2025 | 04:49 AM
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశ రక్షణ రంగానికి అదనంగా రూ.50వేల కోట్ల నిధులు కేటాయించాలని కేంద్రం యోచిస్తోంది.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యమే కారణం.. మొత్తం రక్షణ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటే అవకాశం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం!
న్యూఢిల్లీ, మే 16: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశ రక్షణ రంగానికి అదనంగా రూ.50వేల కోట్ల నిధులు కేటాయించాలని కేంద్రం యోచిస్తోంది. సప్లిమెంటరీ బడ్జెట్ ద్వారా అందించనున్న ఈ మొత్తంతో రక్షణ రంగానికి కేటాయింపులు రూ.7లక్షల కోట్లు దాటనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాయు ధ దళాలకు రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంతకుముందు సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్ల కంటే ఇది 9.2 శాతం ఎక్కువ.
తాజాగా పెంచాలని భావిస్తున్న మొత్తానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ నిధులను పరిశోధన, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర అవసరమైన పరికరాల కొనుగోలు కోసం ఉపయోగించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంలో రక్షణ రంగానికి ప్రాధాన్యం కల్పించారు. 2014-15లో బీజేపీ ప్రభుత్వం రక్షణ శాఖకు బడ్జెట్‌లో రూ.2.29 లక్షల కోట్లు కేటాయించింది.