Cybersecurity Regulations: సైబర్ నేరాలను అరికట్టేందుకు.. న్యూ రూల్స్..
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:00 AM
వాట్సాప్ నుంచి పేమెంట్ యాప్‌లు, ఆహారాన్ని సరఫరా చేసే యాప్‌ల వరకు....
ఆయా సంస్థలన్నీ నిబంధనలు పాటించాల్సిందే
టెలికం సైబర్ సెక్యూరిటీ నిబంధనలను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం
వాట్సాప్, జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, ఫోన్
పే, పేటీఎం తదితర సంస్థలన్నీ సర్కారు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సిందే
సైబర్ నేరాలను అరికట్టేందుకే కొత్త నిబంధనలు!
టెలికం సైబర్ సెక్యూరిటీ నిబంధనలు నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబరు 24: వాట్సాప్ నుంచి పేమెంట్ యాప్‌లు, ఆహారాన్ని సరఫరా చేసే యాప్‌ల వరకు.. మొబైల్ నంబర్ల ఆధారంగా డిజిటల్ సేవలందించే సంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ‘టెలికం సైబర్ సెక్యూరిటీ నియంత్రణ’ల పరిధిలోకి తెచ్చింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు గాను టెలికమ్యూనికేషన్స్ (టెలికం సైబర్ సెక్యూరిటీ) సవరణ నిబంధనలు 2025ను ఈ నెల 22న నోటిఫై చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం.. ఒకేసారి వేర్వేరు డిజిటల్ సేవలు పొందే వినియోగదారుల ఖాతాలను నిలిపివేసే అధికారాలు సంబంధిత సంస్థలకు ఉంటాయి. అలాగే వాడిన ఫోన్ల అమ్మకం లేదా కొనుగోలు చేసేముందు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘మొబైల్ నంబర్ వెరిఫికేషన్ (ఎంఎన్‌వీ)’ వ్యవస్థలో డేటాబేస్ తనిఖీలు తప్పనిసరి చేసింది.
దొంగిలించిన లేదా ఫోర్జరీ చేసిన మొబైల్ కనెక్షన్లు, ఫోన్ హ్యాండ్‌సెట్లతో చేస్తున్న సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. తాజా నిబంధనల్లో ‘టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫయర్ యూజర్ ఎంటైటీస్ (టీఐయూఈ)’ అనే కొత్త విభాగాన్ని సృష్టించారు. లైసెన్స్డ్ టెలికం ఆపరేటర్లు మినహా ఫోన్ నంబర్ల ఆధారంగా వినియోగదారులను గుర్తించి, సేవలందించే వ్యాపార సంస్థలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. జొమాటో, స్విగ్గీ, ఫోన్‌పే, పేటీఎం, ఓలా, ఉబర్ వంటి సంస్థలు టీఐయూఈ విభాగంలోకి వస్తాయి. మెసేజింగ్ సేవల విషయంలో ఎయిర్‌టెల్, జియోలు కూడా ఈ కోవకే చెందుతాయి. కొత్త నిబంధనల మేరకు ఈ టీఐయూఈలు తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్లను సస్పెండ్ చేయడం, ఆయా సంస్థలు వాడే ఫోన్ నంబర్ల డేటాకు సంబంధించిన అభ్యర్థనలకు స్పందించడం, అధికారులు సూచించిన విధంగా వినియోగదారుల గుర్తింపును తనిఖీ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం ఒక ఫోన్ నంబరును నిలిపివేయవచ్చు. అలాగే ఆ నంబరు వినియోగాన్ని నిలిపివేయాలని టెలికం ఆపరేటర్లు, యాప్‌లను ఆదేశించవచ్చు. ప్రజాప్రయోజనాల రీత్యా ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే సంబంధిత సేవలను నిలిపివేయవచ్చు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అడ్డుకునేందుకే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.