Share News

Prime Minister Modi: వికసిత్‌ భారత్‌ దిశగా

ABN , Publish Date - Oct 15 , 2025 | 06:36 AM

విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌ ఏర్పాటుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Prime Minister Modi: వికసిత్‌ భారత్‌ దిశగా

  • గూగుల్‌ ఏఐ హబ్‌తో దేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు ఊతం: మోదీ

  • భారత్‌లో ఆధునిక సాంకేతికత, ఏఐ ఆవిష్కరణలు వేగవంతం: పిచాయ్‌

  • హబ్‌ ప్రణాళికలపై మోదీతో ఫోన్‌లో మాట్లాడిన గూగుల్‌ సీఈవో

  • వికసిత భారత్‌ దిశగా..!

న్యూఢిల్లీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌ ఏర్పాటుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది గ్లోబల్‌ టెక్నాలజీ లీడర్‌గా భారత్‌ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందని పేర్కొన్నారు. ఈ హబ్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం, గూగుల్‌ మధ్య జరిగిన ఒప్పందంపై ప్రధాని మోదీతో ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఫోన్‌లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి హబ్‌ ఏర్పాటు విశేషాలను ఆయన మోదీకి వివరించారు. ఈ సమాచారాన్ని పేర్కొంటూ సుందర్‌ పిచాయ్‌ చేసిన ట్వీట్‌కు మోదీ స్పందించారు. ‘‘ఏపీలోని డైనమిక్‌ సిటీ విశాఖపట్నంలో గూగుల్‌ ఏఐ హబ్‌ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. బహుళ అంచెల పెట్టుబడితో కూడిన ఈ గిగావాట్‌ స్థాయి డేటా సెంటర్‌ వికసిత భారత్‌ను నిర్మించాలనే మా దార్శనికతకు అనుగుణంగా ఉంది. ఇది సాంకేతికతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఒక శక్తిమంతమైన సాధనంగా ఉంటుంది. కృత్రిమ మేధను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజలకు అత్యాధునిక సదుపాయాలను అందిస్తుంది. అలాగే, మన డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇస్తుంది’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

కీలక మైలురాయి: సుందర్‌ పిచాయ్‌

అంతకుముందు ఏఐ హబ్‌ ఏర్పాటుపై సుందర్‌ పిచాయ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘విశాఖపట్నంలో గూగుల్‌ మొట్టమొదటి ఏఐ హబ్‌ ఏర్పాటుకు సంబంధించి మా ప్రణాళికలను ప్రధాని మోదీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఇందులో గిగావాట్‌ సామర్థ్యంతో డేటా సెంటర్‌, నూతన అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీస్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉంటాయి. దీనిద్వారా భారత్‌లోని సంస్థలకు, వినియోగదారులకు అధునాతన సాంకేతికతను అందిస్తాం. ఏఐ ఆవిష్కరణలను, దేశవ్యాప్తంగా వృద్ధిని ఈ హబ్‌ వేగవంతం చేస్తుంది’ అని పిచాయ్‌ పేర్కొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 06:36 AM