Data Center : అమెరికా బయట భారీ పెట్టుబడి రామ్మోహన్
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:46 AM
అమెరికా బయట భారీ పెట్టుబడితో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు....
డిజిటల్ హబ్‌గా ఏపీ: పెమ్మసాని చంద్రశేఖర్
న్యూఢిల్లీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): అమెరికా బయట భారీ పెట్టుబడితో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయడు అన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా రాష్ట్ర జీడీపీ ఏటా రూ.11 వేల కోట్లకు పైగా పెరుగుతుందని తెలిపారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత్ నాయకత్వాన్ని మెరుగుపరుస్తుందన్నారు. కాగా, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రానికి రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్థి, స్వావలంబన ప్రస్థానంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును కీలక మైలురాయిగా అభివర్ణించారు. దీంతో విశాఖకు అవసరమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు లభిస్తాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు మెరుగుపడుతుందని వివరించారు. ఏపీని డిజిటల్ హబ్‌గా నిలపడంలో, దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత పరివర్తనను వేగవంతం చేయడంలో ముందడుగని వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్ర ఏఐ హబ్: ఎంపీ కలిశెట్టి
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ఏఐ హబ్‌గా మారనుందని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయడు కొనియాడారు. ఈ సెంటర్ ఏర్పాటు ఉత్తరాంధ్రలో చారిత్రక ఘటనగా అభివర్ణించారు. ఉత్తరాంధ్రలో ఏఐ, ఐటీ అభివృద్ధికి లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ ఏనాడూ ఆలోచించిన పాపాన పోలేదని విమర్శించారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రను దోచుకొని, అవమానించగా నేడు సీఎం చంద్రబాబు మంచి రోజులు తీసుకొచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.