FSSAI - ORS Labels: ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్‌ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 07:12 AM
ఓఆర్ఎస్ లేబుల్ వినియోగంపై ఆంక్షలు ఉన్నా కూడా కొన్ని రిటెయిల్ షాపుల్లో వీటిని విక్రయిస్తున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వీటిని తక్షణం తొలగించాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ దిశగా అధికారులు తనిఖీలు నిర్వహించి తమకు నివేదిక సమర్పించాలని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: పండ్ల ఆధారిత పానీయాలు, ఎనర్జీ డింక్స్, డబ్ల్యూహెచ్ఓ నిబంధనలకు అనుగుణంగా లేని ఇతర ఎలక్ట్రొలైట్ డ్రింక్స్‌పై ఓఆర్ఎస్ లేబుల్స్‌ను తక్షణం తొలగించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ తాజాగా స్పష్టం (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చేసింది. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్న ఈ లేబుల్స్‌ను తక్షణం తొలగించాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది (FSSAI on ORS Label ban).
ఈ లేబుల్స్ వినియోగించొద్దని గతంలోనే స్పష్టం చేసినా కొన్ని రిటెయిల్ షాపులు, ఈ-కామర్స్ వేదికల్లో ఇంకా వీటిని విక్రయిస్తున్నారని పేర్కొంది. ఈ చర్యలను నిరోధించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించాలని చెప్పింది. నిబంధనలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను వెంటనే సీజ్ చేయాలని, సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తనిఖీల్లో బయటపడ్డ ఉల్లంఘనలు, తీసుకున్న చర్యలపై సవివరమైన నివేదికను కూడా సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.
ఓఆర్ఎస్ లేబుల్ వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ గతంలో విధించిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది. వాణిజ్య అవసరాలకంటే ప్రజాప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ప్రపంచఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసిన డ్రింక్స్‌కు మాత్రమే ఓఆర్ఎస్ అనే లేబుల్‌ను జోడించాలి. పండ్ల ఆధారిత పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్‌పై ప్రజలను తప్పుదారి పట్టించేలా ఓఆర్ఎస్ లేబుల్‌ను వినియోగించకూడదు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 కింద ఎఫ్ఎస్ఎస్ఏఐ అక్టోబర్‌లో ఈ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు
తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ జూనియర్