Stop Using ORS Label : ఆహార ఉత్పత్తులపై ఓఆర్‌ఎస్ వద్దు
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:51 AM
ఆహార ఉత్పత్తుల ప్యాకేజీల మీదగానీ, వాటికి సంబంధించిన ప్రకటనల్లోగానీ ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) అనే పదాన్ని....
కంపెనీలకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబరు 17: ఆహార ఉత్పత్తుల ప్యాకేజీల మీదగానీ, వాటికి సంబంధించిన ప్రకటనల్లోగానీ ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) అనే పదాన్ని ఉపయోగించకూడదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ఆదేశాలు జారీ చేసింది. ఆహార ఉత్పత్తుల బ్రాండ్‌నేమ్‌లతో ఓఆర్‌ఎస్ పదాన్ని కలిపి ఉపయోగించటం ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006కు విరుద్ధమని తెలిపింది. ఈ మేరకు ఓఆర్‌ఎస్ వాడకంపై గతంలో ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు రూపొందించిన ఓఆర్‌ఎస్ ఫార్ములా కాదు’ అనే హెచ్చరికతో ఓఆర్‌ఎస్ పదాన్ని ఉపయోగించుకోవటానికి ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ 2022 జూలైలో, 2024 ఫిబ్రవరిలో అనుమతులు జారీ చేసింది. అయితే, దీనివల్ల వినియోగదారులను మోసపుచ్చేలా కంపెనీలు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లు వెల్లడైందని తాజాగా నిర్ధారించింది. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ నిబంధనల్లో మార్పు వెనుక హైదరాబాద్‌కు చెందిన పిల్లల డాక్టర్ శివరంజనీ సంతోష్ ఉండటం విశేషం. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ గతంలో ఇచ్చిన మినహాయింపుతో పలు కంపెనీలు.. అత్యధికంగా చక్కెర ఉంటున్న ద్రావకాలను ఓఆర్‌ఎస్ పేరుతో విక్రయిస్తున్నాయని శివరంజనీ గత 8 ఏళ్లుగా న్యాయపోరాటం చేశారు.