Share News

Anti-Corruption: కేజ్రీ‘వాల్‌’కు బీటలు కొట్టిన ఆంధ్రా ఐఏఎస్‌

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:10 AM

ఆయన... ఒకప్పుడు ‘ఇండియా అగైనెస్ట్‌ కరప్షన్‌’ పేరిట చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రాచుర్యం పొందారు.

Anti-Corruption: కేజ్రీ‘వాల్‌’కు బీటలు కొట్టిన ఆంధ్రా ఐఏఎస్‌

ఢిల్లీ మాజీ సీఎం అవినీతిని వెలికితీసిన రాజశేఖర్‌

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముడుపుల కేసు

వందకోట్లతో కేజ్రీవాల్‌ విలాసవంతమైన బంగళా

ఇంకా పలు అక్రమాలు, నిధుల దుర్వినియోగం

బలమైన సాక్ష్యాధారాలతో సంచలన నివేదిక

(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి)

యన... ఒకప్పుడు ‘ఇండియా అగైనెస్ట్‌ కరప్షన్‌’ పేరిట చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రాచుర్యం పొందారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ స్థాపించి ఢిల్లీలో సంచలన విజయంతో ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత చిత్రంగా అవినీతి కేసులో జైలుకెళ్లారు. ఆయన అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. అవినీతికి వ్యతిరేకినన్న కేజ్రీవాల్‌ ‘క్రెడిబిలిటీ’కి బీటలు కొట్టింది ఓ ఆంధ్రా ఐఏఎస్‌ అధికారి. అవినీతి విషయంలో కేజ్రీవాల్‌, ఆయన మంత్రులు ఏమీ తక్కువ తినలేదని బలమైన సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఆయనే.. నాటి విజిలెన్స్‌ విభాగం స్పెషల్‌ సెక్రటరీ వైవీవీజే రాజశేఖర్‌. ఆయన స్వస్థలం అనకాపల్లి. ఢిల్లీ మద్యం కుంభకోణం సహా పలు అంశాల్లో కేజ్రీవాల్‌ అవినీతిని ఆయన వెలుగులోకి తీసుకువచ్చారు. యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ లాంటి వారు విభేదించి బయటకు వెళ్లినా పెద్దగా నష్టం జరగలేదు కానీ అవినీతి అభియోగాలు కేజ్రీవాల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముడుపులు తీసుకోవడం, వందకోట్లతో కేజ్రీవాల్‌ విలాసవంతమైన బంగళా నిర్మించుకోవడం, వివిధ సంక్షేమ పథకాల్లో నిధులను స్వాహా చేయడం వంటి అంశాల్లో రాజశేఖర్‌ అంతర్గత నివేదికలను రూపొందించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముడుపులు తీసుకుని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, గోవాలో ఏడు నక్షత్రాల హోటల్‌లో కేజ్రీవాల్‌ బస చేశారన్న అభియోగాలతో తొలుత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, తర్వాత సీఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురు నేతలు జైలు పాలయ్యారు. 2013లో అధికారంలోకి వచ్చినప్పుడు తాను ప్రభుత్వ బంగళాలలో నివసించబోనని శపథం చేసిన కేజ్రీవాల్‌... ఆ తర్వాత ప్రభుత్వ బంగళా తీసుకోవడమే గాక దాని మరమ్మతుల కోసం కొవిడ్‌ సమయంలో కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వైనాన్ని రాజశేఖర్‌ వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ బంగళాలో జిమ్‌, స్పా, స్విమ్మింగ్‌ పూల్‌, రిమోట్‌తో పనిచేసే టాయిలెట్‌ సీట్లతో పాటు ఆధునిక సౌకర్యాలను కేజ్రీవాల్‌ సమకూర్చుకున్నారని నివేదికల్లో బహిర్గతం చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా భారీ ఎత్తున ప్రకటనలకు ఖర్చు పెట్టడం... అనిల్‌ అంబానీ డిస్కమ్‌లకు రూ.1907 కోట్లు అక్రమంగా కట్టబెట్టడం... నిర్మాణ పనుల పేరుతో వందల కోట్ల రూపాయలు మళ్లించడం... రాజకీయ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయడం వంటి అక్రమాలను వెలికితీశారు.


రాజశేఖర్‌పై కక్షసాధింపు చర్యలు

విజిలెన్స్‌ సెక్రటరీ హోదాలో రాజశేఖర్‌ తనకు వ్యతిరేకంగా నివేదికలను రూపొందిస్తున్నారని తెలుసుకున్న కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాజశేఖర్‌ ఓబీసీ (రిజర్వేషన్‌) వర్గానికి చెందినవారు కాదని రుజువు చే యాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలను ఏపీకి పంపించింది. వారు ఐదు రోజులు విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో పర్యటించినా నిరూపించలేకపోయారు. అయినా 22 ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టులో ఆయనపై పిటిషన్‌ దాఖలు చేశారు. రాజశేఖర్‌పై తప్పుడు ఫిర్యాదులతో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు కూడా ధ్రువీకరించింది. కాగా ఇటీ వల హోం శాఖ చేసిన బదిలీలలో భాగంగా రాజశేఖర్‌ అరుణాచల్‌ప్రదేశ్‌కు వెళ్లారు.

Updated Date - Jan 04 , 2025 | 05:10 AM