Share News

Mukesh Chandrakar: ఛత్తీ్‌సగఢ్‌ జర్నలిస్టు హత్యకేసు.. హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:37 AM

ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాకు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు ముఖేశ్‌ చంద్రాకర్‌ హత్యకేసు నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఆదివారం హైదరాబాద్‌లో అరెస్టు చేసింది.

Mukesh Chandrakar: ఛత్తీ్‌సగఢ్‌ జర్నలిస్టు హత్యకేసు.. హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు

చర్ల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాకు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు ముఖేశ్‌ చంద్రాకర్‌ హత్యకేసు నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఆదివారం హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. నిందితుడు సురేశ్‌ చంద్రాకర్‌ హైదరాబాద్‌లోని తన డ్రైవర్‌ ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించామని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు 200 సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడపట్టామని, 300 సెల్‌ఫోన్ల కాల్‌ డేటా రికార్డ్‌(సీడీఆర్‌)ను విశ్లేషించామని చెప్పారు. ఓ ఆంగ్ల జాతీయ చానల్‌కు వార్తలు అందజేసే ముఖేశ్‌ ఈ నెల 3న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే..! ఆయన మృతదేహం ఓ సెప్టిక్‌ ట్యాంకులో లభించగా.. పోస్టుమార్టం నివేదికలో అతని తలపై 15 దెబ్బలు, కాలేయంలో నాలుగు పోట్లు, గుండె భాగంలో గాయాలు, మెడ ఎముకలు నాలుగు చోట్ల విరిగి ఉన్నట్లు తేలింది. ఐదు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ‘‘నా 12 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ ఇంతటి దారుణ హత్యను నేను చూడలేదు’’ అని పోస్టుమార్టంలో పాల్గొన్న ఓ వైద్యుడు మీడియాకు చెప్పారు.

Updated Date - Jan 07 , 2025 | 04:37 AM