Union Minister Shivraj Patil: కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
ABN , Publish Date - Dec 12 , 2025 | 09:18 AM
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల వయసులో శుక్రవారం కన్నుమూశారు.
ముంబై: కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల వయసులో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని నివాసంలో శివరాజ్ పాటిల్ చనిపోయారు. ఆయన లాతూర్ నుంచి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2008 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. 1991 నుంచి 1996 వరకు 10వ లోక్ సభ స్పీకర్‌గా పని చేశారు. పంజాబ్ గవర్నర్‌గా కూడా పని చేశారు. 2010 నుంచి 2015 వరకు యూనియన్ టెర్రిటరీ ఆఫ్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వర్తించారు.
లాతూర్ అడ్డగా...
శివరాజ్ పాటిల్ 1935, అక్టోబర్ 12వ తేదీన జన్మించారు. లాతూర్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1970లలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లాతూర్ లోక్ సభనుంచి ఏడు సార్లు గెలిచారు. అయితే, 2004లో మాత్రం బీజేపీ అభ్యర్థి రూపాతాయ్ పాటిల్ నిలంగ్‌కర్‌పై ఓడిపోయారు. శివరాజ్ పాటిల్‌కు వ్యక్తిగతంగా మంచి పేరుంది. ఆయన తన ప్రత్యర్థులపై ఎప్పుడూ కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. పబ్లిక్ మీటింగ్స్‌లో గానీ, ప్రైవేట్ సంభాషణల్లో కూడా వేరే వ్యక్తుల గురించి ఆయన తప్పుగా మాట్లాడలేదు. ఈ విషయాన్ని ఆయన సహచరులు గర్వంగా చెబుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
నైతిక విలువలు, హుందాతనంతో రాజకీయాలు నెరిపిన పెద్ద మనిషి శివ్ రాజ్ పాటిల్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి, లోక్ సభ మాజీ స్పీకర్ శివ్ రాజ్ పాటిల్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి ప్రస్థానం ప్రారంభించిన పాటిల్ 7 సార్లు ఎంపీగా, లోక్ సభ స్పీకర్‌గా, కేంద్ర హోo శాఖా మంత్రిగా, పంజాబ్ గవర్నర్‌గా సేవలందించారని సీఎం వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
యాత్రలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల..
అదే గంభీర్ చేసిన తప్పు.. ఓటమిపై విమర్శలు గుప్పిస్తున్న మాజీ క్రికెటర్లు