Share News

Vijay Rupani: కార్పొరేటర్‌ స్థాయి నుంచి.. రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా

ABN , Publish Date - Jun 13 , 2025 | 06:09 AM

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం విజయ్‌ రూపానీ (68) కన్నుమూశారు. ఆయన గుజరాత్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

Vijay Rupani: కార్పొరేటర్‌ స్థాయి నుంచి.. రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా

  • ముగిసిన విజయ్‌ రూపానీ ప్రస్థానం

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం విజయ్‌ రూపానీ (68) కన్నుమూశారు. ఆయన గుజరాత్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆనందిబెన్‌ పటేల్‌ స్థానంలో 2016 ఆగస్టు ఏడో తేదీన తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన విజయ్‌ రూపానీ.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రెండోసారి సీఎంగా నియమితులై 2021 సెప్టెంబర్‌ 11 వరకూ కొనసాగారు. 2014 నవంబర్‌ - 2016 ఆగస్టు వరకూ రాష్ట్ర మంత్రిగా.. 2016 ఫిబ్రవరి-ఆగస్టు వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రూపానీ సేవలందించారు. ఆయన తొలుత 1988-96 మధ్య రాజ్‌కోట్‌ నగరపాలక సంస్థ కార్పొరేటర్‌గా.. 1996-97 మధ్య మేయర్‌గా సేవలందించారు. విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నాయకుడిగా పని చేసిన రూపానీ.. రాజ్‌కోట్‌లోని ధర్మేంద్ర సింగ్‌జీ ఆర్ట్స్‌ కాలేజీలో బీఏ పట్టా అందుకుని, సౌరాష్ట్ర యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఎమర్జెన్సీ సమయంలో 1976లో 11 నెలలు జైలు జీవితం గడిపిన రూపానీ.. జైన్‌ బనియా సామాజిక వర్గానికి చెందిన వారు. మయన్మార్‌ (పూర్వ బర్మా)లోని యాంగూన్‌లో రామ్‌నీక్లాల్‌, మాయాబెన్‌ దంపతులకు 1956 ఆగస్టు రెండో తేదీన జన్మించారు. 1960ల్లో భారత్‌కు వలస వచ్చిన రూపానీ కుటుంబం గుజరాత్‌లో స్థిరపడింది. విజయ్‌ రూపానీ కొనుగోలు చేసిన యాక్టీవా/ కారు నంబర్‌ 1206. ఆయన పుట్టిన తేదీ రెండో తేదీ కాగా, విమానంలో సీటు నంబర్‌ 2. ఏ కీలక పని చేపట్టాలన్నా జూన్‌ 12నే ప్రారంభిస్తారు విజయ్‌ రూపానీ. కాగా, ఆయనకు భార్య అంజలి, ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా, చిన్న కుమారుడు పుజిత్‌ ప్రమాదంలో మరణించారు. లండన్‌లో ఉన్న భార్య అంజలి, కూతురు రాధిక వద్దకు వెళ్లేందుకు బయలుదేరిన విజయ్‌ రూపానీ విమాన ప్రమాదంలో మరణించారు.


బ్లాక్‌ బాక్స్‌ చెప్పేస్తుంది!

49.jpg

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణం ఏమిటనేదానిపై ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. అది తెలియాలంటే బ్లాక్‌బాక్స్‌ దొరకాలి. దీనికోసం దర్యాప్తు బృందాలు వెతుకుతున్నాయి. అది దొరికితే.. ఈ ప్రమాదం సాంకేతిక సమస్య వల్ల జరిగిందా.. లేక ఇంజిన్‌ పనిచేయలేదా.., పక్షులు ఢీకొన్నాయా.., విమానంలో మంటలు చెలరేగాయాగా.. లేదా ఇది మానవ తప్పిదం వల్లే జరిగిందా అనేది కచ్చితంగా నిర్ధారించవచ్చు. టేకాఫ్‌ తర్వాత క్లిష్టమైన క్షణాల్లో సిబ్బంది ‘మేడే కాల్‌’ ద్వారా ప్రమాదంలో ఉన్నాం.. సాయం కావాలని కోరినట్టు తెలిసింది. ఆ వివరాలు బ్లాక్‌బాక్స్‌లో రికార్డవుతాయి. బ్లాక్‌ బాక్స్‌ దొరికితే.. దాన్ని డీజీసీఏ లేదా ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ)కి పంపుతారు. అక్కడ దీనిలో రికార్డయిన డేటాను డీకోడ్‌ చేస్తారు. ఆ డేటాను రాడార్‌, ఏటీసీ లాగ్స్‌తో అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి 24 గంటల నుంచి వారం రోజుల వరకూ పట్టవచ్చు. పరికరానికి ఎంత నష్టం వాటిల్లింది అనే దాన్నిబట్టి ఇది ఆధారపడి ఉంటుంది.


రెండు విభాగాలు..

బ్లాక్‌ బాక్స్‌లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (ఎఫ్‌డీఆర్‌)కాగా, మరొకటి కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌). ఎఫ్‌డీఆర్‌ విమాన వేగం, ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఇంజన్‌ పనితీరు, నియంత్రణ వంటి టెక్నికల్‌ డేటాను రికార్డు చేస్తుంది. సీవీఆర్‌.. కాక్‌పిట్‌లో పైలట్ల సంభాషణ, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)తో వారి కమ్యూనికేషన్‌, విమానంలో ఇతర శబ్ధాలను రికార్డు చేస్తుంది. గత 25 గంటల్లో జరిగిన సంభాషణల సమాచారం వీటిలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ రెండింటిలోని డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో, పైలట్లు ఏం మాట్లాడారో, వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని బ్లాక్‌బాక్స్‌ అందిస్తుంది.

Updated Date - Jun 13 , 2025 | 06:09 AM