Supreme Court: ఈసీకి అపరిమిత అధికారాలు ఇవ్వొద్దు
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:46 AM
ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానం అమలులో భారత ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
జేపీసీ సమావేశంలో ఇద్దరు మాజీ సీజేఐల సూచనలు
న్యూఢిల్లీ, జూలై 11: ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానం అమలులో భారత ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎంపీ పీపీ చౌధరి చైర్‌పర్సన్‌గా ఉన్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) శుక్రవారం నిర్వహించిన సమావేశానికి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేఎస్ ఖేహర్ హాజరయ్యారు. జమిలి ఎన్నికలపై వీరు కమిటీకి ప్రజెంటేషన్ ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించిన విధంగా ఈసీఐకి అపరిమి త అధికారాలు ఇవ్వకూడదని, ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ వ్యవస్థ ఉండాలని జడ్జిలు సూచించారు. ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణ యంత్రాంగం ఉండాలన్నారు. ప్రభుత్వం సుపరిపాలన అందించడానికి ఐదేళ్ల పదవీకాలం ఎంతో ముఖ్యమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదని స్పష్టం చేశారు.
జమిలి ఎన్నికల ఆలోచనను అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు సమర్థిస్తున్నారని చౌధరి చెప్పారు. గతంలో ఈ కమిటీ ముందు మాజీ సీజేఐలు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్ హాజరయ్యారు. ఈసీఐకి అధికారాలు ఇవ్వాలనుకోవడాన్ని జస్టిస్ గొగోయ్ కూడా ప్రశ్నించారు. కాగా, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడం రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనంటూ ప్రతిపాదిత బిల్లును పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శించారు. అయితే కమిటీముందు హాజరైన న్యాయ నిపుణులు ఈ విమర్శలను తోసిపుచ్చారు. జాతీయ, రాష్ట్రాల ఎన్నికలు విడివిడిగా నిర్వహించాలని రా జ్యాంగం ఎప్పుడూ ఆదేశించలేదని స్పష్టం చేశారు.