Air India: విమానం.. ఆగమాగం!
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:04 AM
అహ్మదాబాద్ ఘోర ప్రమాదం తర్వాతి నుంచి.. విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు, వెనక్కి మళ్లించడాలు, అత్యవసర ల్యాండింగ్ వంటివి ఆందోళన రేపుతున్నాయి. వరుసగా మరిన్ని ఘటనలు జరుగుతున్నాయి.
వరుసగా సాంకేతిక సమస్యలు, యూటర్న్‌లు
అత్యవసర ల్యాండింగ్‌లతో ఆందోళన
మంగళవారం 8 జాతీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన ఎయిరిండియా
న్యూఢిల్లీ, జూన్ 17: అహ్మదాబాద్ ఘోర ప్రమాదం తర్వాతి నుంచి.. విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు, వెనక్కి మళ్లించడాలు, అత్యవసర ల్యాండింగ్ వంటివి ఆందోళన రేపుతున్నాయి. వరుసగా మరిన్ని ఘటనలు జరుగుతున్నాయి. మంగళవారం వివిధ కారణాలతో ఎనిమిది జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. అందులో ఆరు సర్వీసులు అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ రకం విమానాలే కావడం గమనార్హం. మంగళవారం ఢిల్లీ నుంచి పారిస్ (ఏఐ143), పారిస్ నుంచి ఢిల్లీ (ఏఐ142) సర్వీసులను సాంకేతిక సమస్యలతో రద్దు చేసినట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, పలు దేశాల గగనతలాన్ని మూసివేయడంతో లండన్ నుంచి అమృత్‌సర్‌కు రావాల్సిన ఏఐ170 విమానాన్ని రద్దు చేసినట్టు తెలిపింది. ఇక విమానం అందుబాటులో లేకపోవడంతో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన మరో సర్వీసు కూడా రద్దయింది. అహ్మదాబాద్‌లో టేకాఫ్ అవుతూ కూలిపోయిన ఏఐ171 విమానం స్థానంలో ఏఐ159 కోడ్‌తో సోమవారమే ఈ సర్వీసును ప్రారంభించడం గమనార్హం. ఇక విమానంలో తనిఖీల కారణంగా జాప్యం జరగడం, అప్పటికే పైలట్లు, ఇతర సిబ్బంది విధుల సమయం ముగియడంతో ముంబై-అహ్మదాబాద్ (ఏఐ2493) విమానాన్ని రద్దు చేసినట్టు ఎయిరిండియా తెలిపింది. ఢిల్లీ-దుబాయ్ (ఏఐ915), ఢిల్లీ-వియన్నా (ఏఐ153), లండన్-బెంగళూరు (ఏఐ132) విమానాలనూ రద్దు చేసినట్టు ప్రకటించింది. మరోవైపు దేశవ్యాప్తంగా విమానాల షెడ్యూల్‌లో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో.. కఠినమైన తనిఖీలు, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పలుదేశాల గగనతలాన్ని మూసివేయడం వంటివి ఈ ఆలస్యానికి కారణమని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు.
విమానాల్లో సమస్యలతో ఆందోళన..
మరోవైపు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబైకి బయలుదేరిన ఎయిరిండియా ఏఐ180 విమానం ఎడమ ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనితో మంగళవారం తెల్లవారుజామున కోల్‌కతాలో ప్రయాణికులందరినీ విమానం నుంచి దింపేసి.. లోపాన్ని సరిదిద్దే పని చేపట్టారు. గోవా నుంచి లక్నోకు వెళుతున్న ఇండిగో విమానం ఎయిర్ టర్బలెన్స్‌తో తీవ్ర కుదుపులకు గురైంది. సోమవారం సాయంత్రం 4.25 గంటలకు ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. టేకాఫ్ అయిన కాసేపటికే వెనక్కి మళ్లించి ఢిల్లీలో ల్యాండ్ చేశారు. మస్కట్ నుంచి కోచి మీదుగా ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందన్న బెదిరింపులతో మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. మరోవైపు, కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో మూడు రోజుల క్రితం అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటన్ యుద్ధ విమానం ఎఫ్-35బీ ఇంకా అక్కడే ఉంది. అందులోని హైడ్రాలిక్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ప్రమాదానికి గురైన విమాన.. పైలట్ల శిక్షణ రికార్డులు ఇవ్వండి
న్యూఢిల్లీ, జూన్ 17: అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపించిన పైలట్ల శిక్షణ రికార్డులను తమకు అందజేయాలని ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది. పైలట్లతోపాటు ఆ విమానం బయలుదేరడానికి అనుమతి ఇచ్చిన అధికారుల శిక్షణ వివరాలనూ అందజేయాలని కోరింది. ప్రభుత్వం రహస్యంగా సర్క్యులేట్ చేసిన మెమోలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. దేశంలోని అన్ని విమన, హెలికాప్టర్ పైలట్ శిక్షణ సంస్థలు (ఫ్లైయింగ్ స్కూళ్లు) అన్ని రకాల భద్రతా తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది.