Share News

Hindustan Aeronautics Limited: నాసిక్‌లో తొలి తేజస్సు

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:53 AM

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) నాసిక్‌లో తయారు చేసిన లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌....

Hindustan Aeronautics Limited: నాసిక్‌లో తొలి తేజస్సు

  • తేజ్‌స-ఎంకే1ఏ తొలి ప్రయాణం విజయవంతం

నాసిక్‌, అక్టోబరు 17: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) నాసిక్‌లో తయారు చేసిన లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (ఎల్‌సీఏ) తేజ్‌స-ఎంకే1ఏ యుద్ధ విమానం శుక్రవారం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హాల్‌కు చెందిన మూడో ఉత్పత్తి కేంద్రమైన మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ఫైటర్‌ జెట్‌ను తయారు చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇక్కడి ఎల్‌సీఏ, హిందుస్థాన్‌ టర్బో ట్రైనర్‌ (హెచ్‌టీటీ-40) ఉత్పత్తి కేంద్రాలను శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం రక్షణ మంత్రి సమక్షంలో తేజ్‌స-ఎంకే1ఏ తన విన్యాసాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా నాసిక్‌ ఎయిర్‌బే్‌సలో దీనికి జలఫిరంగులతో స్వాగతం పలికారు. తేజ్‌స-ఎంకే1ఏ తన తొలిప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నప్పటికీ.. దీన్ని భారత వాయుసేన (ఐఏఎ్‌ఫ)కు అప్పగించాలంటే మరికొంత సమయం పడుతుంది. వెపన్‌, రాడార్‌ ఇంటిగ్రేషన్‌ పరీక్షలు కూడా పూర్తయిన తర్వాతే దీన్ని ఐఏఎ్‌ఫలోకి చేర్చే అవకాశం ఉంది. తేజ్‌స-ఎంకే1ఏ ఫైటర్‌ జెట్లను హాల్‌ ఇప్పటికే బెంగళూరులోని రెండు కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు నాసిక్‌లోనూ కొత్తగా మరో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ ప్రతి ఏటా ఎనిమిది తేజస్‌ యుద్ధ విమానాలు తయారు చేస్తారు. కాగా, శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తేజ్‌స-ఎంకే1ఏతోపాటు హెచ్‌టీటీ-40, సుఖోయ్‌30-ఎంకేఐ ఫైటర్‌ జెట్లు కూడా విన్యాసాలు ప్రదర్శించాయి.

  • హాల్‌.. దేశ రక్షణ శక్తికి చిహ్నం

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) దేశ రక్షణ శక్తికి చిహ్నంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. నాసిక్‌లో హాల్‌ ఏర్పాటు చేసిన ఎస్‌సీఏ, హెచ్‌టీటీ-40 ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నాసిక్‌లోని హాల్‌ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఇక్కడ పనిచేస్తున్న ప్రతిఒక్కరిలోనూ ఉత్సాహం కనిపిస్తోంది. తేజ్‌స-ఎంకే1ఏ, సుఖోయ్‌30-ఎంకేఐ ఫైటర్‌ జెట్లను నడిపిన పైలట్లకు నా శుభాకాంక్షలు. హాల్‌ దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తోంది. ఈ రోజు తేజస్‌ ఎకే1ఏ, సుఖోయ్‌-30, హెచ్‌టీటీ-40 యుద్ధ విమానాలను చూసినప్పుడు నా హృదయం గర్వంతో ఉప్పొంగింది. ఇది మనం సాధించిన స్వావలంబనకు నిజమైన ఉదాహరణ’ అని తెలిపారు.

  • తేజ్‌సపై అనేక దేశాలు ఆసక్తి: డీకే సునీల్‌

ఎల్‌సీఏ తేజస్‌ ఎంకే1ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయని హాల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డీకే సునీల్‌ అన్నారు. కొన్ని దేశాలతో చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. తేజస్‌ ఎంకే1ఏ సామర్థ్యం ఏమిటో.. దీనిలో తాము ఏమేం మార్పులు చేయగలమో వారికి వివరిస్తున్నామని వెల్లడించారు. నాసిక్‌లో తాము రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే మొదటి తేజ్‌సను తయారు చేశామని, మరో రెండు తయారీ దశలో ఉన్నాయని చెప్పారు. ఇది హాల్‌ సాధించిన గొప్ప విజయమని అన్నారు. 2032-33 నాటికి 180 యుద్ధ విమానాలను తయారు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. అలాగే ఎస్‌టీఏ ఎంకే2 ఫైటర్‌ జెట్ల నిర్మాణానికి కూడా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Oct 18 , 2025 | 04:54 AM