Share News

Bihar Elections: బిహార్‌లో తొలి విడత పోలింగ్‌ నేడే

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:06 AM

బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో గురువారం మొదటి దశ పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి.

Bihar Elections: బిహార్‌లో తొలి విడత పోలింగ్‌ నేడే

  • 121 అసెంబ్లీ స్థానాలు.. బరిలో 1,314 మంది అభ్యర్థులు

  • తేజస్వి, తేజ్‌ప్రతాప్‌, సామ్రాట్‌ చౌధురి సహా కీలక నేతలు

  • 3.75 కోట్ల మంది ఓటర్ల చేతిలో నేతల భవితవ్యం

  • పోలింగ్‌ కేంద్రాలు 45,341.. కొత్త ఓటర్లు 10.72 లక్షలు

  • ‘సర్‌’ తర్వాత తొలి ఎన్నికలివే!

  • ఎన్‌డీఏ వైపే బిహార్‌ మొగ్గు.. మూడు సర్వేల్లో వెల్లడి

పట్నా, నవంబరు 5: బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో గురువారం మొదటి దశ పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం నితీశ్‌కుమార్‌ సారథ్యంలోని ఎన్‌డీఏ, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ స్థాపించిన జన్‌సురాజ్‌ పార్టీ సహా వివిధ పార్టీల నుంచి 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థి తేజస్వి (రాఘోపూర్‌), బీజేపీకి చెందిన ఉపముఖ్యమంత్రులు సామ్రాట్‌ చౌధురి (తారాపూర్‌), విజయకుమార్‌ సిన్హా (లఖీసరాయ్‌), మంత్రులు మంగళ్‌ పాండే (శివన్‌), నితిన్‌ నవీన్‌ (బంకీపూర్‌), సంజయ్‌సరోగి (దర్భంగా), జీవేశ్‌కుమార్‌ (జాలే), కేదార్‌ప్రసాద్‌ గుప్తా (కుర్హని), జేడీయూ మంత్రులు శ్రావణ్‌కుమార్‌ (నలంద), విజయకుమార్‌ చౌదురి (సరాయ్‌రంజన్‌), మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ పెద్దకుమారుడు, జనశక్తి జనతాదళ్‌ అధినేత తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ (మహువా) తదితరుల భవితవ్యాన్ని 3.7 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాఘోపూర్‌లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని తేజస్వి భావిస్తున్నారు. ఆయనపై బీజేపీకి చెందిన సతీశ్‌కుమార్‌ పోటీచేస్తున్నారు. ఈయన 2010 ఎన్నికల్లో తేజస్వి తల్లి, మాజీ సీఎం రాబ్రీదేవిని ఓడించారు. ఇక్కడి నుంచే బరిలోకి దిగుతానని ప్రశాంత్‌ కిశోర్‌ గతంలో ప్రకటించా రు. అయితే రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సి ఉన్నందున ఎన్నికల్లో పోటీచేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. చంచల్‌సింగ్‌ అనే నేతకు ఇక్కడ టికెట్‌ ఇచ్చారు. యువ జానపద గాయని మైథిలి ఠాకూర్‌ బీజేపీ తరఫున ఆలీగంజ్‌ నుంచి.. భోజ్‌పురీ సూపర్‌స్టార్లు ఖేసరిలాల్‌ యాదవ్‌ (ఛాప్రా-ఆర్‌జేడీ), రితేశ్‌ పాండే (కార్గాహార్‌-జన్‌సురాజ్‌) కూడా బరిలో ఉన్నారు. జనసురాజ్‌ కార్యకర్త హత్య కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న అనంత్‌సింగ్‌ (జేడీయూ) మొకామా నుంచి పోటీచేస్తున్నారు. ఆయనపై మరో గ్యాంగ్‌స్టర్‌ సూరజ్‌భాన్‌ భార్య వీణాదేవి ఆర్‌జేడీ తరఫున బరిలో ఉన్నారు. తొలి విడతలో 45,341 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 36,733 ఉన్నాయి. ఈ 121 స్థానాల్లో జనాభా 6.60 కోట్ల మంది కాగా.. ఓటర్లు 3.75 కోట్ల మంది. వీరిలో కొత్త ఓటర్లు 10.72 లక్షల మంది అని ఈసీ వెల్లడించింది. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు 7.38 లక్షల మంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌) తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలివే.

Updated Date - Nov 06 , 2025 | 05:07 AM