Delhi MP Apartments: ఢిల్లీలో ఎంపీల అపార్ట్‌మెంట్లలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:18 AM
ఢిల్లీలో పలువురు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు నివాసం ఉండే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 18: ఢిల్లీలో పలువురు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు నివాసం ఉండే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కొంత మంది పిల్లలకు గాయాలయ్యాయని కొందరు నివాసితులు పేర్కొన్నారు. బాబా ఖరగ్ సింగ్ మార్గ్‌లో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1.22 గంటల ప్రాంతంలో సమాచారం అందిన వెంటనే 14 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. 2020లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అనేక మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల నివాసాలున్నాయి. కింద ఉండే ఫ్లోర్‌లో పటాసులు పేల్చిన సందర్భంగా ప్రమాదం జరిగిందని సమాచారం.