Justice System: వేధించిన న్యాయమూర్తికి పదోన్నతి.. మధ్యప్రదేశ్‌లో మహిళా జడ్జి రాజీనామా
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:18 AM
తనను వేధించిన ఓ న్యాయమూర్తికి పదోన్నతి లభించడాన్ని నిరసిస్తూ ఓ మహిళా జడ్జి రాజీనామా చేశారు
భోపాల్, జూలై 30: తనను వేధించిన ఓ న్యాయమూర్తికి పదోన్నతి లభించడాన్ని నిరసిస్తూ ఓ మహిళా జడ్జి రాజీనామా చేశారు. తన ఆవేదనను రాష్ట్రపతికి లేఖ రూపంలో వివరించినా.. ఫలితం లేదని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న అదితికుమార్ శర్మ అనే జడ్జి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. తనను వేధించిన న్యాయమూర్తి రాజేశ్‌కుమార్ గుప్తాకు మధ్యప్రదేశ్ హైకోర్టులో పదోన్నతి లభించడానికి నిరసనగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. గుప్తా పదోన్నతిని నిరసిస్తూ తాను రాష్ట్రపతికి, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సుప్రీంకోర్టుకు, రిజిస్ట్రార్ జనరల్, కొలీజియంకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ లేఖలపై ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనుభవించిన హింస కేవలం శారీరకమైనది కాదని, తన గౌరవం, గళం, న్యాయమూర్తిగా అస్తిత్వం నాశనం అయ్యాయని ఆమె వాపోయారు.