Family Conflict National News: బిహార్లో తండ్రీకొడుకుల పోరు
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:44 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీ ఆర్‌జేడీలో ముసలం పుట్టినట్లు సంకేతాలు వెలువడ్డాయి.
అభ్యర్థులకు లాలూ టికెట్లు.. వెనక్కి తీసేసుకున్న తేజస్వి.. ఆర్‌జేడీ నేతల్లో కలకలం
పట్నా/న్యూఢిల్లీ, అక్టోబరు 14: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీ ఆర్‌జేడీలో ముసలం పుట్టినట్లు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ టికెట్లు పంపిణీ చేయగా.. ఆయన చిన్న కుమారుడు, పార్టీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వాటిని వెనక్కి తీసుకోవడం ఆర్‌జేడీ నేతలను విస్మయపరుస్తోంది. తండ్రీకొడుకుల నడుమ ఆధిపత్య పోరు బహిర్గతం కావడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. విపక్షాల మహాగఠ్‌బంధన్(మహాకూటమి) కూడా షాకైంది. పాలక ఎన్‌డీఏ పక్షాలు పొత్తు ఖరారుచేసుకుని అభ్యర్థుల జాబితాలు కూడా విడుదల చేస్తుండగా.. విపక్షాల నడుమ ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు. ఐఆర్‌సీటీసీ స్కాం కేసులో ఢిల్లీ కోర్టులో హాజరైన లాలూ, ఆయన భార్య రాబ్డీదేవి సోమవారం సాయంత్రం పట్నాలోని తమ నివాసానికి చేరుకున్నారు. తర్వాత టికెట్ ఆశావహులకు పార్టీ నాయకత్వం నుంచి ఫోన్లు వెళ్లాయి. వారంతా లాలూ నివాసంలోకి వెళ్లి ఆనందంతో బీఫారాలు తీసుకుని బయటకు వచ్చారు. వీరిలో ఇటీవల సీఎం నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీయూ నుంచి ఆర్‌జేడీలోకి వచ్చిన సీనియర్ ఎమ్మెల్యేలు సునీల్‌సింగ్ (పర్బత్తా), నరేంద్రకుమార్‌సింగ్ అలియాస్ బోగో (మతిహానీ), ఆర్‌జేడీ సిటింగ్ సభ్యులు భాయ్ వీరేంద్ర, చంద్రశేఖర్ యాదవ్, ఇజ్రాయిల్ మన్సేరీ కూడా ఉన్నారు. తేజస్వి సైతం ఢిల్లీ కోర్టులో హాజరై కొద్ది గంటల తర్వాత పట్నా చేరుకున్నారు. తనకు తెలియకుండా తండ్రి టికెట్లు పంపిణీ చేయడంపై మనస్తాపానికి గురయ్యారు. అదీగాక మిత్రులతో సీట్ల లెక్క తేలకుండా టికెట్ల పంపిణీ సబబు కాదని.. భాగస్వామ్య పక్షాలు సీరియ్‌సగా తీసుకోవచ్చని తండ్రికి నచ్చజెప్పారు. రాత్రి పొద్దుపోయాక.. టికెట్లు దక్కిన నేతలందరికీ మళ్లీ ఫోన్లు చేసి పిలిపించారు. ‘సాంకేతిక కారణాలతో’ వారందరి నుంచి తేజస్వి బీఫారాలు వెనక్కి తీసుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కూడా..
గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా లాలూ ఏకపక్షంగా వ్యవహరించారు. 40 సీట్లకు గాను 23 చోట్ల ఆర్‌జేడీ అభ్యర్థులను నిలిపారు. గెలిచే సీట్లు కాకుండా ఓడిపోయేవి ఇచ్చారని మిత్రపక్షాలు ఇప్పటికీ లాలూను ఆక్షేపిస్తుంటాయు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన అలాగే వ్యవహరించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి తేజస్విపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. 243 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్ 70-75 సీట్లు అడుగుతోంది. వీఐపీ 50 సీట్లతో పాటు ఉపముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోంది. సీపీఐ, సీపీఎం 24 స్థానాల చొప్పున అడుగుతున్నాయి. ఆర్‌జేడీ కనీసం 134 సీట్లలో పోటీచేస్తానని పట్టుబడుతోంది.
71 మందితో
బీజేపీ తొలి జాబితా
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మందితో బీజేపీ తన తొలి జాబితాను మంగళవారం ప్రకటించింది. ఇందులో పలు విశేషాలు చోటు చేసుకున్నాయి. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన స్పీకర్ నంద కిశోర్ యాదవ్‌కు సీటు ఇవ్వకపోగా.. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌఽధరికి సీటు ఇచ్చారు. శాసన మండలి సభ్యుడు, ఆరోగ్యం, న్యాయ శాఖ మంత్రి మంగళ్ పాండేను కూడా బరిలో దించడం విశేషం. ఈ ముగ్గురూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినవారే. స్పీకర్ సీటు పట్నా సాహిబ్‌లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్ గుప్తాను నిలబెట్టారు. కాగా మాజీ కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్‌కు దానాపూర్ సీటును కేటాయించడం పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. లఖిసరాయ్ నుంచి మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించిన డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు మళ్లీ అదే సీటు దక్కింది. ప్రస్తుత మంత్రులు ఆరుగురికి సీట్లు దక్కాయి. 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేదు. 9 మంది మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ జానపద, భక్తి గీతాల గాయని మైథిలి ఠాకూర్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైశ్వాల్ సమక్షంలో మంగళవారం బీజేపీలో చేరారు. ఆమెకు దర్భంగా ప్రాంతంలోని అలీ నగర్ సీటును కేటాయించే అవకాశం ఉంది.