FASTag Annual Pass: ఫాస్టాగ్ వార్షిక పాస్.. యాక్టివేట్ చేసుకోండిలా...
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:25 PM
నేషనల్ హైవేపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ఫాస్టాగ్ వినియోగదారులకు వార్షిక పాస్ సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విధానం అమల్లోకి వచ్చి సుమారు మూడు నెలలు పూర్తైనా చాలామంది వాహనదారులు దీన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో అసలు ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ అంటే ఏమిటి? ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే వివరాలు మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. వాణిజ్యేతర వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్(FASTag Annual Pass)ను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గానూ రూ.3000 వార్షిక టోల్‌పాస్(Toll pass) ద్వారా కేంద్రం ఈ విధానాన్ని రూపొందించింది. ఫలితంగా.. ఇక టోల్ చెల్లింపులకు ఫాస్టాగ్ కార్డులను పదే పదే రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరముండదు.
ఇలా ఒకసారి రూ.3000 చెల్లించడం ద్వారా.. ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు(ఏది ముందయితే అది) జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. ఒకవేళ ఏడాది కాలంలో 200 ట్రిప్పులు(200 Trips) పూర్తయితే.. మరలా రీఛార్జ్ ద్వారా ఈ ప్లాన్‌ను పొందవచ్చు. ఇలా ఏడాదిలో ఎన్నిసార్లైనా చేస్కోవచ్చు. కానీ ఈ నూతన విధానం కార్లు, జీపులు, వ్యాన్‌లు వంటి వ్యక్తిగత ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే.. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు మళ్లీ కొత్తగా దీన్ని తీస్కోవాల్సిన అవసరం లేదు. పాత ఫాస్టాగ్‌తోనే ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
రాజ్‌మార్గ్(Rajmargyatra) యాత్ర అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా NHAI, రవాణా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాలి.
మొబైల్ నంబర్, వెహికల్ నంబర్, ఫాస్టాగ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
పేమెంట్ గేట్‌వే ద్వారా రూ.3000 చెల్లించాలి. ఆ తర్వాత దాదాపు రెండు గంటల్లో పాస్ యాక్టివేట్ అయిపోతుంది.