Share News

Maharashtra Farmer Compensation: పంటనష్టం కింద రైతుకు పరిహారం 2.30

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:55 AM

అకాల వర్షాలతో 6.5 ఎకరాల్లో వేసిన పంట తుడిచిపెట్టుకుపోవడంతో ప్రభుత్వం నుంచి పరిహారం కింద వచ్చే మొత్తంతో పెట్టుబడి ఖర్చులైనా మిగులుతాయని ఆ రైతు ఆశించాడు.

  Maharashtra Farmer Compensation: పంటనష్టం కింద రైతుకు పరిహారం 2.30

  • ఖాతాలో పడాల్సింది లక్షన్నరకు పైగానే... అవాక్కయిన బాధిత రైతు.. మహారాష్ట్రలో ఘటన

ముంబై, నవంబరు 4: అకాల వర్షాలతో 6.5 ఎకరాల్లో వేసిన పంట తుడిచిపెట్టుకుపోవడంతో ప్రభుత్వం నుంచి పరిహారం కింద వచ్చే మొత్తంతో పెట్టుబడి ఖర్చులైనా మిగులుతాయని ఆ రైతు ఆశించాడు. అయితే ఆ రైతు ఖాతాలో ప్రభుత్వం వేసిన మొత్తమెంతో తెలుసా? కేవలం రెండు రూపాయల ముప్పై పైసలు! మహారాష్ట్రలోని శిలోత్తర్‌ గ్రామానికి చెందిన మధుకర్‌ బాబూరావు అనే రైతుకు ఎదురైన దిగ్ర్భాంతికరమైన అనుభవమిది. బాబూరావు.. ‘పీఎం ఫసల్‌ భీమా యోజన’ కింద తాను వేసిన పంట కోసం జూలై 16న రూ.1148 ప్రీమియం కట్టారు. ఇటీవల అకాల వర్షాలతో ఆయన వేసిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 6.5 ఎకరాల్లో పంట నష్టాన్ని లెక్కగట్టిన వ్యవసాయాధికారులు బాబూరావుకు పరిహారం కింద రూ.1,53,110 వస్తాయని తేల్చారు. అయితే అక్టోబరు 31న ఖాతాలో మాత్రం రూ.2.30 మాత్రమే వేశారు. అవాక్కయిన బాబూరావు.. అధికారులను సంప్రదించగా పొరపాటైందంటూ నాలుక్కరుచుకున్నారు. 2023లోనూ బాబూరావుకు పంట నష్టం జరిగింది. అప్పట్లో ఆయనకు పరిహారం కింద రూ. 72,466 రావాలి. అయితే రూ.72,463.70 మాత్రమే ఖాతాలో వేశారు. అప్పట్లో ఆ మిగిలిన రూ.2.30ను ఇప్పుడు ఇచ్చారన్నమాట! సాంకేతిక సమస్య వల్లే అలా జరిగినట్లు అధికారులు అంగీకరించారు.

Updated Date - Nov 05 , 2025 | 04:55 AM